హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త వంతెనను అందుబాటులోకి తెచ్చింది. నగరంలోని బైరామల్‌గూడ చౌరస్తా వద్ద ఎస్సాఆర్డీపీ ప్యాకేజీలో భాగంగా రూ. 26.45 కోట్లతో కొత్తగా 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ వంతెనను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి స్లాబ్స్, క్రాష్ బారియర్స్, ఫిక్షన్ స్లాబుల నిర్మాణంలో ఆర్‌సీసీ ఫ్రీకాస్ట్ టెక్నాలజీ వాడారు. రూ.448 కోట్లతో ప్యాకేజీ-2లో భాగంగా ఎల్‌బీనగర్, బైరామల్‌గూడ, నాగోల్ కామినేని చౌరస్తా, చింతల్‌కుంటలో వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీలో భాగంగా కామినేని చౌరస్తా వద్ద నిర్మించిన వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎల్‌బీనగర్ నుంచి ఒవైసీ ఆసుపత్రి వైపు వెళ్లే మార్గంలో ఈ వంతెన అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్, సాగర్‌రోడ్ జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. బైరామల్‌గూడ జంక్షన్‌లో రద్దీ వేళల్లో గంటకు 12 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి.