వంగపండు ప్రసాదరావు కాలికి గజ్జెకట్టి గొంతెత్తితే.. జన ఉప్పెన. ఆయన రాజ్యం(ప్రభుత్వం) వ్యతిరేకి. ఆయన పాటలో.. మాటలో రాజ్య వ్యతిరేక ధోరణి కన్పించి తీరుతుంది. ఎందుకుంటే ఆయన కమ్యూనిస్టుల్లోని అతివాద కమ్యూనిస్టులుగా నిలిచిన నక్సలైట్లకు మద్దతుదారు. ఈ నక్సలైట్లనే ఇప్పుడు మావోయిస్టులు అని అంటున్నారు. అటువంటి వంగపండు మరణిస్తే… ఆయనకు రాజ్య లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడమే ఆశ్చర్యం. ఆ లాంఛనాలను వంగపండు కుటుంబం అంగీకరించడం మరో విచిత్రం. వంగపండు పదో తరగతి పెయిలై ఐటీఐలో చేరిన ఆయనను చైనాతో భారత్ చేసే యుద్ధంలో పాల్గొనడానికి రండన్న సర్కారు పిలుపునకు స్పందించి.. ట్రైనింగ్ తీసుకున్నారు. యుద్ధం ఆగిపోవడంతో వెనక్కి వచ్చాడు. పెళ్లైన రెండేళ్ల తర్వాత నక్సలబరీ ఉద్యమంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఆయన రాజ్య వ్యతిరేక భావనలో ముందున్నాడు.

గద్దర్తో కలిసి 1972లో జన నాట్యమండలిని స్థాపించి, ఊరువాడా తిరిగారు. వీరిద్దరు రాజ్యానికి వ్యతిరేకంగా కట్టిన తమ పాటలతో తెలంగాణ, ఆంధ్ర అన్నతేడా లేకుండా ఆనాటి యువత మార్క్సిజం వైపునకు వెళ్లేలా చేశారు. వంగపండులోని రాజ్య వ్యతిరేక భావనలకు ఆయన రాసిన పాటలే నిదర్శనం. ఆర్ నారాయణమూర్తి నిర్మించిన ‘అర్దరాత్రి స్వంతంత్రం’ సినిమాలో వంగపండు రాసి పాడిన ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా.. ఏం పిల్లో ఎల్దామొస్తవా.. శ్రీకాకుళంలో చీమకొండకు ఎల్దమొస్తవా. చిలకలు కత్తులు దులపరిస్తయట.’ అప్పట్లో ఆ పాట విని కాలు కదపని వ్యక్తి కనపబడడు. ఈ పాటలో అణువణువునా రాజ్యంపై తనకున్న వ్యతిరేక భావాన్ని దట్టించాడు వంగపండు. జీవితంలో రాజ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వంగపండు.. చనిపోయిన తర్వాత రాజ్యం లాంఛనాలతో అంత్యక్రియలు జరపపడానికి ముందుకు రావడం.. ఆయన కుటుంబం అంగీకరించడమే ఆశ్యర్యమే. ఇక్కడ చర్చనీయాంశమేమిటంటే.. రాజ్యాన్ని వంగపండు అంగీకరించినట్టా..? వంగపండును రాజ్యం అంగీకరించినట్టా..?