శతృవుకు శతృవు తనకు మిత్రుడు. ఇది ఎక్కువగా రాజకీయాలు, వ్యాపారాల్లో ఉపయోగపడుతుంది. తనకు నచ్చని రాజకీయ పార్టీకి పోటీదారు అయిన పార్టీకి మద్దతుగా నిలబడడం. మన దేశంలో చూస్తే బీజేపీ అంటే కమ్యూనిస్టులకు నచ్చదు కాబట్టి. బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్కు మద్దతుగా నిలబడతారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని మత ఘర్షణలు జరిగినా.. దాన్ని లౌకికపార్టీగానే పరిగణిస్తారు. అవసరమైతే తమ ఆయువును కూడా కాంగ్రెస్కు దారపోస్తారీ కమ్యూనిస్టులు. శతృవుకు శతృవు తనకు మిత్రుడంటే ఇదే. ఇప్పుడు విషయానికొద్దాం. భారత్కు చిరకాల మిత్రదేశం.. నేపాల్. ఈ దేశాన్ని భారత్కు దూరం చేయాలని కంకణం కట్టుకున్న చైనా.. తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుత నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి వెన్నంటిగా నిలిచి.. మరీ పార్లమెంట్లో బిల్లు నెగ్గేలా చూసింది. ఇవన్నీ ఒకెత్తు.
తాజాగా కేపీ శర్మ ఓలి ప్రధాని పదవికి మాజీ ప్రధాని ప్రచండ ఎసరు పెట్టారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ప్రధాని పదవి తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో కుంపటి రగిల్చారు. ఓలి ఎంత ప్రయత్నించినా.. ప్రచండ దారికి రావడం లేదు. దీంతో ఏకంగా చైనా రంగంలోకి దిగి.. ఓలి ప్రభుత్వానికి కాపాడడానికి రాయబారి హౌ యాంకిని పంపించింది. ఈ వారం వ్యవధిలో అంటూ జూలై 3న నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని కలిశారు. అయితే మాజీ ప్రధాని ప్రచండ మాత్రం ఆమెను కలవడానికి ఇష్టపడడం లేదని ప్రచారం జరుగుతోంది. చైనా ప్రభుత్వం మాత్రం హౌ సమావేశాలను సమర్థించింది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో విబేదాలు రావడం తనకు ఇష్టం లేదని చెబుతోంది. చైనా అసలు ఉద్దేశం ఏమిటంటే.. తాను చెప్పినట్టు వింటున్న ఓలినే కొనసాగేలా చేయాలి. ప్రచండ మళ్లీ అధికారంలోకి రాకూడదని దాని ఉద్దేశం. మొత్తానికి భారత్కు నేపాల్ వ్యతిరేకంగానే కొనసాగేలా చేయాలని చైనా కుట్ర. అందుకే నవ్వు ముఖం లేని, అసలు నవ్వే రాని చైనాను నమ్మొద్దని తిలక్ ఏనాడో చెప్పారు.