–వికాస్ రుషి
ప్రముఖ దినపత్రిక ఈనాడులో అసాధరణమైన ఒక నిర్ణయం గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది. నిన్నటి వరకూ ఈనాడుకు చీఫ్ ఎడిటర్‌గా ఉన్న రామోజీరావు పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు ఫౌండర్‌గా మారిపోయారు. ఇది పేపర్ వెనుక పేజీలో కింద ఉన్న వివరాలు చూస్తేనే కాని ఎవరికి తెలియదు. ఈనాడుకు ఇప్పటి నుంచి తెలంగాణకు, ఏపీకి ఇద్దరు ఎడిటర్లు నియమితులయ్యారు. తెలంగాణకు డీఎన్ ప్రసాద్. ఏపీకి ఎం నాగేశ్వరరావు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటివరకూ ఒక్క తెలుగు పేపర్‌కు ఇద్దరు ఎడిటర్లు ఉన్నది మొదట్లో కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ (సీపీఎం) ఆధ్వర్యంలో నడిచే ‘ప్రజాశక్తి’కి తొలుత కొన్ని రోజుల పాటు సాంకేతికంగా ఒక్కరే అయినప్పటికీ.. తెలంగాణ, ఏపీకి వేర్వేరు ఎడిటర్లను నియమించారు. ఆ తర్వాత ఆ పత్రిక రెండు ముక్కలైంది. ఏపీలో ప్రజాశక్తిగానే ఉంటే, తెలంగాణలో నవ తెలంగాణగా రూపుదిద్దుకున్నది. ఆ తర్వాత ఆంధ్రప్రభలో తెలంగాణకు వీఎస్సార్ శర్మ, ఏపీకి సతీష్‌చంద్రను నియమించారు. చివరకు పత్రిక ఓనర్ ముత్తా గౌతమ్ ఎడిటర్లుగా కొనసాగుతున్నారు. ఇందులో శర్మ వర్కింగ్ జర్నలిస్ట్.

ఇప్పుడు ఈనాడు వద్దకు వద్దాం. ఈ పత్రిక ప్రచురణ ప్రారంభమైనప్పటి నుంచి రామోజీరావు 13–12–2019 వరకూ నిరాకంటంగా ఎడిటర్‌గా కొనసాగుతూనే ఉన్నారు. 14–12–2019 నుంచి ఈ పత్రికకు ఇద్దరు ఎడిటర్లు వచ్చారు. రామోజీరావు ఫౌండర్‌గా మిగిలిపోయారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా.. ఈనాడుకు అండగా ఉన్న ప్రధాన ఆర్ధిక వనరు మార్గదర్శి చిట్‌ఫండ్‌ను దెబ్బకొట్టారు. అప్పట్లో ఉండవల్లి అరుణ్‌కుమార్ మార్గదర్శిపై పోరాటం చేశారు. ఆ దెబ్బకు ఈనాడు, ఈ టీవీ గ్రూప్‌లో సగానికి ‘బ్లాక్‌స్టోన్’ కంపెనీకి విక్రయించారని, ఆ తరువాత రిలయన్స్ గ్రూప్ వచ్చిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టీవీ గ్రూప్‌లో సీరియల్స్ ప్రసారం చేసే ఛానల్ మాత్రమే రామోజీరావు కుటుంబానిదని ఓపెన్ సీక్రెట్. మిగిలినవన్నీ.. రిలయన్స్‌కు ఇచ్చేశారని ఒక ప్రచారం. సోమాజీగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయం నుంచి అన్ని విభాగాలు ఫిల్మ్‌సిటీకి మారిపోయాయి. ఇప్పుడు ఈ ఎడిటర్ మార్పు అనేది రామోజీరావుకు వయసు మీద పడ్డదనేనా..? లేక మరేమన్నా కారణాలున్నాయా..? అన్నది అంత ఈజీగా బయటపడే అంశమూ కాదు. ఏది ఏమైనా రామోజీరావు స్థాయిలో ఒక వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసిన వారు తెలుగులో కన్పించరన్నది మాత్రం వాస్తవం.
Good