అప్పుడెప్పుడో ఆత్మగౌరవం అంటూ రోడ్డెక్కిన సీనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు దగ్గరికి చేర్చుకున్నారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెల్లిగా గొంతు విప్పుతున్నారు. ఆత్మగౌరవం అంటున్నారు. 1980 దశకంలో ప్రముఖ నటుడైన ఎన్టీఆర్‌కు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమైన ఒకరు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. దీంతో ఎన్టీవోడీ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆ టైంలో కాంగ్రెస్‌లో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదనుకున్న నాదెండ్ల భాస్కర్‌రావు, ఎన్టీవోడిని కలిశారు. ఇద్దరు కలిశారు.. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో రోడ్డెక్కారు. కాంగ్రెస్‌ను తొక్కేసి.. టీడీపీ గెలిచేసింది. ఈ సీన్ తర్వాత.. అల్లుడు చంద్రబాబు.. టీడీపీలో చేరడం.. ఆ తర్వాత లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. ఈ పెళ్లి తర్వాత లక్ష్మీ పార్వతి కారణంగా చంద్రబాబు ఆత్మగౌరవం దెబ్బతిన్నది.
తనది దెబ్బతిన్నది కాబట్టి.. అందరి ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టుగా సీన్ క్రియేట్ చేసి.. ఎన్టీఆర్‌ను గద్దె దించారు. చంద్రబాబు సర్కార్‌లో.. కేసీఆర్‌కు ఆత్మగౌరవం దెబ్బతిన్నది. తనొక్కడికే కాదు.. తెలంగాణ ప్రజలకే దెబ్బతిన్నదని చెప్పేశాడు. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆత్మగౌరవం దెబ్బతిన్నవాళ్ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఫస్ట్ హరీశ్‌రావుకు ఆ తర్వాత ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, జోగు రామన్న, రసమయి బాలకిషన్ ఇలా చెప్పుకుంటూ చాంతాడంతా లీస్ట్ తయారు చేయోచ్చు.
ఈ రోజుకు బోదన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. గెలిచిన ఒకే ఒక్క ముస్లిం ఎమ్మెల్యేను నాకు మంత్రి పదవి ఇవ్వరా..? మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు. ఆత్మగౌరవం లేకుండా ఉండలేమంటున్నారు. పైగా కవితను ఓడగొట్టిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కలుసుకున్నడు. మారితే పార్టీ మారొచ్చన్నడు. ఆత్మగౌరవంటే అంత పవర్‌పుల్. దీని పవర్ కేసీఆర్‌కు ఎరికే. అయినా.. ఎమ్మెల్యేలు, ఎంపీ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదంటున్నారు. పట్టించుకోకుంటే.. ఏం జరుగుతుందో.. పొలిటికల్ లీడర్లకు ఎరికే. అందరికంటే ఒక్కాకు ఎక్కువ చదివిన కేసీఆర్‌కు తెలుసు. అయినా.. వెయిట్ అండ్ సీ అంటున్నడు. ఏం జరుగుతుందో చూడాలి.