నువ్వే కాదు నేను కూడా ఓనర్నే.. నేను అడుక్కునే బ్యాచ్ కాదు. ఓరిజినల్ అంటూ పదునైన ఈటెలు విసిరారు.. ఎప్పుడూ శాంతంగా ఉండె ఈటల రాజేందర్. ఆయన విసిరిన ఈటెలు సూటిగా ఓ ముగ్గురు నలుగురిని తాకే ఉంటాయి. అందులో కేటీ(సీ)ఆర్ అయితే.. మిగిలిన వారిలో కచ్చితంగా తలసాని శ్రీనివాస యాదవ్ సహా బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్ ఉంటుంది. ఈటల మాత్రం తెలంగాణ ఉద్యమం(యూటీ బ్యాచ్)లో మొదటి నుంచి ఉన్నవాడే. వైఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడి పోయినప్పుడు ఎమయ్యా తలకాయ ఎక్కడ పెట్టుకుంటావంటూ ఈటల్లాంటి మాటలు వైఎస్ అన్నప్పుడు పడింది ఈ ఈటలే.
మొదటిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే.. బంగారు తెలంగాణ బ్యాచ్ అంటే.. టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు. తలసాని, ఎర్రబెల్లి దయాకరరావు వంటివాళ్లు పోలోమని టీఆర్ఎస్లో చేరిపోయారు. అసలు కంటే కొసరే ఎక్కువైనట్టు వీళ్లలో కొందరి పెత్తనం టీఆర్ఎస్లో మరీ ఎక్కువైంది. తామే తెలంగాణ ఉద్యమకారులమన్నట్టుగా తెగ బిల్డప్ ఇచ్చేశారు. తామె గులాబి జెండా ఓనర్లమన్న తీరుగా మాట్లాడేశారు. మాట్లాడుతున్నారు కూడా. ఇది బీటీ బ్యాచ్ కథాకమీషు. ఇప్పుడు ఈటల ఏమన్నారో చూద్దాం.
మధ్యలో ఒచ్చినోడిని కాదు
తెలంగాణ కోసం మూడున్నర కోట్ల ప్రజల తరుపన పోరాటం చేశాను. నన్ను చంపాలని రెక్కీ నిర్వహించినా.. తెలంగాణ జెండా పట్టుకొని ఎదురుగా వెళ్లాను. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడాను. పార్టీలోకి మధ్యలోకి వచ్చిన వాడిని కాను. గులాబీ జెండా ఓనర్లలో నేనూ కూడా ఒకడిని. రాజకీయాల్లో అనామకుడిగా వచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నా మంత్రి పదవి ఎవరి భిక్షా కాదు. బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు. అధికారం కాదు ధర్మం, న్యాయమే శాశ్వతం. చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు ప్రజలే. కుహానావాదులు, సంకుచిత బుద్ధితో వ్యవహరించేవారు జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా ఎదగలేని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు హీరోనో ఎవరు జీరోనో అతి త్వరలోనే తెలుస్తుంది’ అని ఈటల్లాంటి మాటలను ఈటల రాజేందర్ విసిరారు. సో.. ఈటల విసిరిన ఈటల్లాంటి మాటల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.