అనుచిత వ్యాఖ్యలు చేసిన అజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదని డిప్యూటీ స్పీకర్ రమాదేవి స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాఖ్ అంశంపై గురువారం చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి మీ కళ్లల్లో కళ్లు పెట్టి చూసి మాట్లాడాలని అనుకుంటున్నాను అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ అంశంపై డిప్యూటీ స్పీకర్ రమాదేవి శనివారం మీడియాతో మాట్లాడారు.
అజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. స్పీకర్ కుర్చీలో ఉన్న తనను రెండు సార్లు అజంఖాన్ అవమానించారని తెలిపారు. ఆ తరువాత కూడా క్షమాపణ కోరలేదని తెలిపారు. సభలో ఉన్న ప్రతి ఒక్కరిని తాను గౌరవంగా చూస్తానని చెప్పారు. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఖాన్ చైర్‌వైపు కాకుండా.. ఎంపీలను చూస్తూ మాట్లాడారని తెలిపారు. అందుకే చైర్‌వైపు చూసి మాట్లాడాలని తాఉన అజంఖాన్‌ను ఆదేశించినా.. పట్టించుకోకుండా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఖాన్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే తాను కౌంటర్ ఇచ్చేదాన్ని కానీ.. తాను గౌరవప్రదమైన కుర్చీలో కూర్చొని అలా చేయడం బావించానని చెప్పారు. అజం చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరచడంతో పాటు పురుషుల గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. అజంఖాన్ వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఖండించారు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అజం సోమవారం తన ఎదుటకు హాజరై భేషరతుగా క్షమాపణలు చెప్పాలని స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఆదేశించారు.