Home జాతీయం కాంగ్రెస్ పుట్టి నుంచి బీజేపీ స్టీమ‌ర్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ పుట్టి నుంచి బీజేపీ స్టీమ‌ర్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

620
0
గోవా ఎమ్మెల్యేల‌కు స్వాగ‌తం పలుకుతున్న జేపీ న‌డ్డా

గ‌తంలో పెద్ద నౌక‌లా ఉన్న కాంగ్రెస్ నేడు పుట్టిలా మారింది. పుట్టిలా ఉన్న బీజేపీ స్టీమ‌ర్‌లా మారింది. వారు వీరు.. వీరు వార‌వ‌డం జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మేగా. వ‌రుస ఓట‌ముల త‌ర్వాత కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డ‌డం.. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధే చేతులు ఎత్తివేశారు. ఎవ‌రైన త‌మ భ‌విష్య‌త్ బాగుండాల‌ని కోరుకుంటారుగా.. అదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా భావించి ఉంటారు. అందుకే గోవా బీచ్‌లో కాంగ్రెస్ పుట్టి ముంచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిందూ మ‌హా స‌ముద్రంలోని స్టీమ‌ర్‌లా వెలుగుతున్న బీజేపీలో చేరిపోయారు.

విష‌య‌మేమిటంటే.. నిర్ల‌క్ష్యంగా ఉంటే ఎలాంటి ప‌రిణామాలకు దారితీస్తుందో నేటి కాంగ్రెస్‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2017లో గోవాలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. ఎట్లాగు మాదేగా అదికార‌మ‌న్న ధీమాతో.. హోట‌ల్లో కాంగ్రెస్ పెద్ద పెద్ద నేత‌లు సంబురాలు చేసుకుంటుంటే… ప‌క్క నుంచి వ‌చ్చిన‌ బీజేపీ అమాంతం ముఖ్య‌మంత్రి సీటు ఎగురేసుకొని పోయింది. రాజ్యాంగ విరుద్ధం.. తొక్క తోలు అని కాంగ్రెస్‌ అంటుంటే.. అంద‌రూ న‌వ్వుకున్నారు. ఆనాడు వీళ్లు చేసిందే.. ఇయ్యాల బీజేపీ చేసింద‌ని. స‌రే అధికారం పోతే పోయిందిలే అని స‌మాధాన‌ప‌డ్డారు.

క‌ర్ణాట‌క సంక్షోభం ముంచుకొచ్చింది. ముంచుకొచ్చేదాక కాంగ్రెస్ అధిష్ఠానం స‌ప్పుడు చేయ‌కుంటా కూర్చుని.. చేతులు కాలినాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టు..ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉండిపోయింది. ఇక్క‌డి ప‌రిస్థితుల గురించి ఆలోచిస్తుండ‌గానే.. గోవాలో ప‌రిస్థితి చేతులు మారింది. కాంగ్రెస్ తేరుకొని చూసేలోగానే.. ఆ పార్టీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత స‌హా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. సీఎల్పీని బీజేఎల్పీలో విలీనం చేసేశారు. గోవా స్పీక‌ర్‌.. య‌మ స్పీడుగా ఆమోదించేశారు. అదే ఉత్సాహంతో ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా చేతుల మీదుగా కండువాలు మెడ‌లో వేసుకున్నారు. కాంగ్రెస్ తేరుకునేలోగానే.. కండువాలు మారి పోయాయి. స్పీడంటే అది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here