కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలవడానికి వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ముంబాయిలోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేసిన కాంగ్రెస్, జేడీ(ఎస్) తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలవడానికి డీకే నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. డీకేను కలవడం తమకు ఇష్టం లేదని.. తమకు అదనపు భద్రత కల్పించాలని ముంబాయి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముంబాయి పోలీస్ కమిషనర్‌కు * డీకే శివకుమార్, కుమారస్వామి మమ్ములను కలవడానికి వస్తున్నట్టు సమాచారం అందింది. వారు మమ్ములను బెదిరించే అవకాశముంది. వారిని హోటల్‌లోకి అనుమతించవద్దు. భద్రత పెంచండి.* అని 10 మంది ఎమ్మెల్యేలు లేఖ రాసి సంతకాలు పెట్టారు. లేఖ అందుకున్న అనంతరం అదనపు పోలీస్ కమిషనర్ (నార్త్ రీజియన్) దిలీప్ సావంత్ అక్కడికి చేరుకొని భద్రతను పెంచారు.
బుధవారం ఉదయం తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలవడానికి హోటల్‌కు వచ్చిన డీకేను లోనికి అనుమతించలేదు. వారిని కలవడానికి ఎవరూ వచ్చినా.. ఎమ్మెల్యేల అనుమతి లేనిదే అనుమితించమని పోలీసులు స్పష్టం చేశారు. కాగా.. రాజీనామా చేసిన 13 మందిలో 8 మంది ఎమ్మెల్యేల లేఖలు స్పీకర్ ఫార్మాట్ లో లేనందున తిరష్కిరిస్తున్నట్టు కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు తనను స్వయంగా కలవాలని కూడా తేదీలు నిర్ణయించడంతో గోవాకు బయలు దేరిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. తిరిగి మంగళవారం రాత్రి ముంబాయికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డీకే వారిని కలవడానికి ప్రయత్నించి భంగపడ్డారు.