- వికాస్ రుషి
తాను చేస్తే సంసారం.. వేరేవాడు చేస్తే ఇంకోదే అన్నట్టుగా ఉంది మాజీ… ముఖ్యమంత్రి.. చంద్రబాబు వైఖరి. అది విలీనం కాదు.. పార్టీ ఫిరాయింపే.. వారీపై అనర్హత వేటు వేసే వరకూ చంద్రబాబు పోరాటం చేస్తాడంట. విన్నోళ్లు హ.. హ.. అని నవ్వుకుంటునారు. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్ (వీరిద్దరూ బాబుకు అత్యంత సన్నిహితులు), టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు (ఈయన తెలంగాణ వ్యక్తి) .. పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు (చంద్రబాబు మరీ దగ్గర)కు లేఖ ఇచ్చారు. ఆ వెంటనే బీజేపీలో చేరడం, రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం చేస్తూ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు ఇవ్వడం వేగంగా జరిగిపోయాయి.
ఈ వార్త విన్న చూసిన టీడీపీ నేతలు అన్యాయం.. అక్రమం.. ఇంత దారుణమా..? అంటూ ఆవేదన.. ఆక్రోశం వెల్లగక్కారు. ఇదే రీతిన పచ్చ పత్రికలుగా జగన్ పేర్కొనే వాటిలో కథనాలు వచ్చాయి. కాకుంటే గతంలో వచ్చినంత వేడిగా కాకుండా.. గిల్లీ గిల్లనట్టుగా ఈ కథనాలు వచ్చాయి. సో ఇక్కడి వరకూ బాగానే ఉంది.. ఈ ఫిరాయింపు విదేశాల్లో ఉన్న చంద్రబాబుకు మంటపెట్టినట్టైంది. పదవీ లేకున్నా ఆ దర్ఫం పోదుగా వెంటనే యూరప్ నుంచి పార్టీ నేతలతో టెలీ కాన్పరెన్సులో మాట్లాడారు. కొందరు టీడీపీ ఎంపీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీలోకి ఫిరాయించారు. దానికి విలీనమని పేరు పెట్టి నాటకం ఆడుతున్నారు. ఆ ఎంపీల చర్య కచ్చితంగా ఫిరాయింపే.. ఈ విలీనం చెల్లదు. చట్ట ప్రకారం అనర్హత వేటు వేయాల్సిందే. వారిపై వేటు వేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు లేఖ కూడా ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన వారిపై వేటుపడే వరకూ పోరాటం చేద్దాం. అని చంద్రబాబు గట్టిగా తన తమ్ముళ్లకు చెప్పారు. వేటు వేసే వరకూ పోరాటం చేద్దామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చదవిన వారందరూ నవ్వుకుంటున్నారు.
తాను చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే ఇంకేదో అన్నట్టుగా లేదూ. మామ ఎన్టీఆర్ చేతుల్లోంచి పార్టీని ఎలా గుంజుకున్నదో అందరికీ తెలియదా..? పాత ముచ్చట పక్కన పెట్టు.. మొన్నటికిమొన్న.. ఏపీలో అధికారంలోకి రాగానే బాబు చేసిందేమిటీ..? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. మరికొందరికి నామినేటేడ్ పోస్టులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి పదవులు ఇవ్వకుండా ఆనాడు రాజీనామాలు చేయించి.. మళ్లీ గెలిపించుకున్నట్టయితే.. ఇయ్యాల వేటు గురించి మాట్లాడే అర్హత ఉండేదీ కదా. అవతలిపక్షం గురించి మాట్లాడేటప్పుడు తాను చేసింది కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడి ఉంటే.. బాగుండేదీ.