- వికాస్ రుషి
రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాజకీయ వివాదాలకు తెరలేపింది. వీర్ సావర్కర్ పేరును మార్చి వేసింది. అశోక్‌గెహ్లాట్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే గత బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన వాటిల్లో తిరిగి మార్పులు చేసింది. ఇందులో భాగంగా తొలుత పాఠ్య పుస్తకాలను సమీక్షించేందుకు ఫిబ్రవరి 13న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పాఠ్య పుస్తకాలను సమీక్షించిన తరువాత.. పాఠ్య పుస్తకాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు రాజకీయ ప్రయోజనం కల్గించే అంశాలున్నాయని పేర్కొంటూ పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని సూచిస్తూ నివేదిక అందజేసింది. పాఠ్యాంశాల్లో కమిటీ సూచించిన మార్పులను చేసిన తర్వాత కొత్త పుస్తకాలను రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 12వ తరగతి (ఇంటర్), 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలను మార్చి వేసింది. దీంట్లో వీర్ సావర్కర్ పేరులోంచి వీర్ అనే పదం తొలగించింది. జమాతే-ఇ-ఇస్లాం, అల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇతిహాదుల్, సిమి వంటి మతతత్వ సంస్థల జాబితాలో హిందూ మహాసభను కూడా చేర్చింది. అయితే ఈ జాబితాలో హిందూ మహాసభనే మొదటి పేరుగా పేర్కొంది. జిహాద్ కారణంగానే పక్క దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయన్న పాఠ్యాంశంలో జిహాద్ అన్న పదాన్నే పూర్తిగా తొలగించింది. మహారాణా ప్రతాప్ స్వాతంత్రయోదుడు కాదన్నట్టుగా.. కేవలం అధికారం కోసమే అక్బర్‌తో యుద్ధం చేశారంటూ మార్పులు చేశారు. వీటితో పాటు అనేక అంశాలను మార్చి వేసింది. తాజాగా కొత్త పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తోంది.
సావర్కర్ వీరుడు కాడు
పాత టెక్ట్స్‌బుక్ః 12వ తరగతిలోని స్వాతంత్రోద్యమంలో వీర్ సావర్కర్ పాత్రపై విస్తృతంగా చర్చించారు. ఇందులో అతడిని వీర్ సావర్కర్‌గా అభివర్ణించారు.
కొత్త పుస్తకంః ఈ భాగంలో వీర్ సావర్కర్ బదులుగా సావర్కర్ పేరుకు ముందు వీర్ తొలగించి వినాయక్ దామోదర్ సావర్కర్‌గా మార్పు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వానికి తనను విడుదల చేయాలంటూ వేడుకుంటూ నాలుగు పిటీషన్లు పెట్టుకున్నారని, 14 నవంబర్ 1911న పెట్టుకున్న రెండో పిటీషన్లో ‘son of Portugal’గా పేర్కొన్నారని తెలిపింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారని, పాకిస్థాన్ ఏర్పాటును వ్యతిరేకించారని పేర్కొంది. గాంధీ హత్య కుట్రలో సావర్కర్ కూడా ఉన్నారని, ఆ తరువాత నిర్దోషిగా విడుదలయ్యారని పేర్కొంటూ మార్పులు చేశారు. ( సౌజన్యం : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ )