హైదరాబాద్ః అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు దూసుకొని పోతున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఐదేళ్లలో శాంతిని, సామరస్యాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే అభివృద్ధి చేస్తారని నమ్మిన ప్రజలు పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు తిరుగులేని విజయం కట్టబెట్టారని తెలిపారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధిరేటు సాధించిందని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అడుగులు వేసినట్లు కేసీఆర్ తెలిపారు. కుల, చేతి వృత్తులను ప్రోత్సహించడం ద్వారా వారి జీవన ప్రమాణాల మెరుగు పడడానికి తమ ప్రభుత్వం కృషి చేసినట్టు చెప్పారు. అతి తక్కువ కాలంలో విద్యుత్ కొరతను అధిగమించి నిరంతర కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం చేపట్టిన మిషన్ భగీరథ సఫలం అవుతోందని తెలిపారు. ఎవరి ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు నేరుగా లబ్దిదారులకే అందుతున్నాయని చెప్పారు. పెంచిన పింఛన్లు జులై నుంచి అమలు చేస్తామమన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన ఆశీస్సులే ప్రభుత్వానికి పెట్టని కోటలుగా నిలిచాయని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తిచేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తలపెట్టిన ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఇకపై ఎటుచూసినా పచ్చనిపైర్లే దర్శనమిస్తాయన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేశామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం, సంరక్షణతో సస్యశ్యామల సమశీతల తెలంగాణ ఆవిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి పూర్తిగా రూపుమాపినప్పుడే పాలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆయన తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం అమలులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.