- వికాస్ రుషి
అదిగో కోతి.. అంటే ఇదిగో కొండెంగ ఇది పుకార్లు ఎలా పుడతాయో చెప్పేందుకు వాడే మాట. తెలంగాణలో ఇది బాగా పాపులర్. అవతలి వ్యక్తి కోతి అన్నాడు కాబట్టి ఇవతలి వ్యక్తి కొండెంగ అంటాడు. వాస్తవానికి ఈ రెండు అక్కడ ఉండవు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి… ప్రత్యర్థి పార్టీలపై పుకార్లు పుట్టించడానికి దారులు వెతుకుతుంటుంటారు. ఇందుకు సోషల్ మీడియా ఒక వేదికైంది. ఒక పెద్ద వీడియో నుంచి చిన్న క్లిప్పింగ్ వేరు చేసి.. దాన్ని పోస్ట్ చేయడంతో షేర్ చేయడం విపరీతంగా నడుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ కురువృద్దుడు ఎల్‌కే అద్వానీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అవమానించారు.
పక్కనే ఉన్న ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పట్టించుకోలేదన్న రీతిలో కథనాలు వస్తున్నాయి. ఒక క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా గింగిరాలు కొడుతోంది. దీన్ని చూసిన వారు పాపం అద్వానీ అనుకోక మానరు. ఒకానొక బహిరంగసభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 5 ఏప్రిల్ 2019న బీజేపీకి మూల పురుషుడైన అద్వానీని గెంటివేశారు. అంటూ ఆరోపించారు. ఆ తరువాత ఈ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది. ఆ వెంటనే దాన్ని వైరల్‌గా మార్చేశారు. ఈ క్లిప్పింగ్ లో ఏముందంటే.. వేదిక మీద నుంచి అద్వానీని షా వెళ్లి పోమ్మన్నుట్టగా ఉంటుంది.
వాస్తవానికి ఇది సరైన క్లిప్పింగ్ కాదు. 9 ఆగస్టు 2914లో ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన వీడియోలోంచి ఈ క్లిప్పింగ్‌ను తయారు చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన రెండు వీడియోల నిడివి నిడివి దాదాపు 5 గంటలు. ఆ రెండు వీడియోలను మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ సమావేశానికి ఆనాటి తెలంగాణ శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి సహా అనేక మంది ముఖ్యులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసే వరకూ అద్వానీ అక్కడే ఉన్నారు.
షా, అద్వానీ పక్క పక్కనే కూర్చున్నారు. అమిత్ షాను అద్వానీ సన్మానించడం, ఆయన ఆశీస్సులను షా తీసుకోవడం కన్నిస్తోంది.
ఈ వీడియోలో 21 నిమిషం నిశితంగా గమనించండి. అద్వానీని ప్రసంగించాలని ఆహ్వానించడంతో ఆయనను అక్కడే ఉండి మాట్లాడాలని అమిత్ షా మైక్‌ను సవరించడం కన్పిస్తుంది. ఆయన మాత్రం తాను పోడియం నుంచి మాట్లాడుతానని లేచి వెళ్లి దాదాపు 24 నిమిషాలు మాట్లాడారు. అసలు వీడియోను పక్కన పెట్టి.. క్లిప్పింగ్‌లను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఈ అవమాన ప్రచారం జరుగుతోంది. ఇక అద్వానీకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా అవమానపరిచారంటూ మరో ప్రచారం. మూడేళ్ల క్రితమే 75 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని పార్టీలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈసారి సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదు. అద్వానీ 1991 నుంచి ఇప్పటివరకూ మధ్యలో రెండేళ్లు మినహా ఆయన గాంధీనగర్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆ స్థానం నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు షా పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో యువతకు అవకాశమివ్వాలని ఉపన్యాసాలు దంచేవారు కూడా అద్వానీకి టికెట్ ఇవ్వకుండా అవమానించారంటూ ప్రకటనలు చేస్తున్నారు.