ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు అశాంతి ఎదురైంది. గత ఎన్నికల్లో మాధిరిగా ఈసారి నామినేషన్ వేసే అంశంలో చుక్కెదురైంది. నర్సాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన ఆయన భీమవరం శాసనసభ స్థానానికి నామినేషన్ వేయడానికి వచ్చే సరికే సమయం మించిపోయింది. దీంతో ఆయన నామినేషన్ తీసుకోవడానికి రిటర్నింగ్ అధికారి నిరాకరించారు. అనంతరం పాల్ మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ వేసేందుకు వచ్చిన తనను అక్కడి అధికారులు సమయం లేదంటూ అడ్డుకున్నారని తెలిపారు. తన ప్రతినిధి పూర్తి పత్రాలతో మధ్యాహ్నం 2.40 గంటలకు ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లాడన్నారు. అనంతరం కొద్దిసేపటికే తాను అక్కడికి చేరుకున్నప్పటికీ సమయం అయిపోయిందంటూ తన నామినేషన్‌ను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని పాల్ చెప్పారు. తాను నామినేషన్ వేయకుండా వేయకుండా వైస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు.తన గుర్తు హెలికాప్టర్ కావడంతో తుప్పు పట్టిన ఫ్యాన్‌కు ఓట్లు పడవని ఆయన వ్యాఖ్యానించారు. భీమవరంలో పోటీ చేస్తున్నానని ప్రకటించగానే.. పవన్ గుండెల్లో రైళ్లు పరుగెట్టాయని చెపపారు. నర్సాపురం లోక్‌సభ స్థానంలో గెలవగానే నార్త్ అమెరికాలా మార్చేస్తానని హామీ ఇచ్చారు. నామినేషన్ వేయడానికి పరిగెత్తుకొని వెళ్లడాన్ని చూసిన స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు.