హైదరాబాద్ః దేశ భద్రత ఎంత ముఖ్యమో.. దేశాభివృద్ధి కూడా తమ ప్రభుత్వానికి అంతే ముఖ్యమని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైదరాబాద్ లో ఆదివారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా తమది టూ డీ సర్కార్ అని తెలిపారు. దేశ రక్షణ (డిఫెన్స్)పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేసిందని తెలిపారు. దేశంలో నక్సలిజాన్ని 160 జిల్లాల నుంచి 40 జిల్లాలకు తగ్గించగలిగామన్నారు. అదే విధంగా పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా పాకిస్థాన్‌లోకి వెళ్లి.. ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసి బుద్ది చెప్పామని చెప్పారు. ముంబాయిలో ఉగ్రదాడి జరిగిన వెంటనే..ఆనాటి యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే..ఈనాడు ఈ పరిస్థితి వచ్చేదీ కాదన్నారు. సైనికుల సాహసాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతుంటే.. కొందరు మాత్రం సాక్షాలు అడుగుతున్నారని విమర్శించారు. దేశాభివృద్ధి కోసం చిత్తశుద్దితో కృషి చేశామని చెప్పారు. అవినీతి జరగకుండా అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రైతాంగానికి మద్దతు ధర కల్పించడంతో పాటు పంట పెట్టుబడి కూడా అందిస్తున్నామని చెప్పారు. 2022 నాటికి రైతు ఆదాయం 200 శాతం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూపీఏ హయాంలో పప్పు దినుసుల కొరతను ఎదుర్కున్న సంగతిని ప్రస్తావిస్తూ.. దశాబ్దకాలం పాటు ఈ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వాజ్‌పేయ్ దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దితే యూపీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత చతికిలబడిందని తెలిపారు. మళ్లీ మోదీ ప్రధానమంత్రి అయిన తరువాతే ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిని పడిందన్నారు. ఈ దేశ రక్షణ, అభివృద్ధి జరగాలంటే మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరముందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు వివరించి.. వారిని ఓటు వేసే విధంగా చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.