కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కొన్ని పత్రికలకు, టీవీ ఛానళ్లకు పీకల దాకా కోపముంది. ఈ మీడియాలో బీజేపీ రామా అన్నా బుతులాగే వస్తుంది. వాటికి నచ్చినట్టుగా రాసుకుంటాయి. ఇంగ్లీషు పత్రికల్లో జాతీయ దిన పత్రిక ది హిందులో బీజేపీపై వ్యతిరేక కథనాలు వస్తుంటాయి. ఈ మధ్య వచ్చిన రఫెల్ కథనాలు బీజేపీని, ప్రధానంగా మోదీకి ఇబ్బందికరంగా మారాయి. హిందు వామపక్ష భావాలు గల పత్రిక కాబట్టి సిద్ధాంత పరమైన వ్యతిరేకత ఉండడం సహజం. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేకంగా తెలుగు మీడియా పని చేస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఛానళ్లు, పత్రికల విషయానికొస్తే ఆంధ్రజ్యోతి పోషిస్తున్నాయి. ఈ కోవలోకే కొత్తగా సాక్షి పత్రిక అడుగు పెట్టింది. ముందుగా టీవీ 9, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మీడియా టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడం, ప్రచురించడం చేస్తూనే ఉన్నాయి. అప్పట్లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రచురించి, ప్రసారం చేసిన టీఆర్ ఎస్ ముఖ్యనేత భూకబ్జా కథనం సంచలనం సృష్టించింది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీవీ 9 ప్రసారం చేసిన ఎమ్మెల్యేలకు ల్యాప్ ట్యాప్ కథనం, ప్రత్యేకించి అప్పటి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బొడిగే శోభను చూపిస్తూ ప్రసారం చేసిన కథనం పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కథనం ద్వారా సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని చెబుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9పై నిషేధం విధించింది. తెలంగాణ లో ఈ రెండు ఛానళ్లు ప్రసారం కాకుండా టీఆర్ ఎస్ సర్కారు చర్యలు తీసుకున్నది. నిషేధం ఎత్తివేసే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలించలేదు. చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఆశ్రయించాయి. ఈ విషయంలో బీజేపీ నేతలు కూడా మీడియా అధిపతులకు సహకరించ లేదు. రెండేళ్లు గడిచిన తరువాత ఛానళ్ల అధిపతుల అభ్యర్థనను అంగీకరించిన సర్కారు.. నిషేధం క్రమేపి ఎత్తివేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికీ ఈ రెండు ఛానళ్లు ఎక్కడా సరిగా రావు. బీజేపీ అదుకోక పోవడంతోనే నష్టం జరిగిందన్న భావనలో ఉన్న ఈ రెండు ఛానళ్లు సహా ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యతిరేక కథనాలు వస్తూనే ఉన్నాయి. సాక్షి విషయానికి వస్తే ఇటీవల వరకూ బీజేపీకి అనుకూలంగా లేకున్నా.. వ్యతిరేకంగా మాత్రం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంద్రప్రదేశ్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా అవినీతి పరుడని ఆరోపించారు. ఇక అప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా సాక్షిలో కథనాలు వస్తున్నాయి. బీజేపీపై మీడియా వ్యతిరేకంగా కథనాలు రాయడానికి ప్రధాన కారణం ఇది.