తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు అర్జంట్‌గా యాదాద్రి నరసన్న గుర్తుకొచ్చిండు. వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని నర్సన్న దయవల్లే కరోనాను ఎదుర్కున్నామని చెప్పుకొచ్చి దండం పెట్టిండు. ఇది విన్న అందరూ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయారనుకో. ఎందుకంటే నిన్నగాక మొన్నే భద్రాద్రి కొత్తగూడెంలో ఏసు కారణంగానే కరోనా తగ్గిందని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంకేముంది తెల్లారంగనే తెలంగాణలో రచ్చ రచ్చే జరిగింది. బీజేపీ సహా కొన్ని హిందూ సంస్థలు, రాజకీయ పార్టీలు, నాస్తిక సంఘాలు దుమ్మెత్తి పోశాయి.

అర్రె అని నాలుక్కరుచుకున్న శ్రీనివాస రావు విరుగుడు ఆలోచించి.. యాదాద్రి నర్సన్న దగ్గరకు వచ్చి.. స్వామి నీ దయవల్లే కరోనాను ఎదుర్కున్నామంటూ దండం పెట్టిండు. ఇంకేముంది అంతా సల్లబడింది. కాకుంటే క్రిస్మస్ వేడుకల్లో మాత్రం కరోనా తగ్గడానికి ఏసే కారణమన్న ఆయన, యాదాద్రికి వచ్చి మాత్రం నర్సన్న దయవల్ల ఎదుర్కున్నామని అన్నారు. కొంత మొగ్గు క్రిస్మస్ వైపే కన్పించింది. ఈయన దేవుండ్లకు దండం పెట్టి వాళ్ల ప్రాపకం పొందడంతో పాటు సీఎం కేసీఆర్ కాల్లు మొక్కేసీ ఆయన ప్రాపకం పొందాడు. ఎంతైనా బతక నేర్చనోడుగా. బలే నెట్టుకొస్తున్నాడులే.
