కొన్ని వార్తలు వినడానికి కూడా విచిత్రంగా ఉంటాయి. కోపం కూడా వస్తోంది. నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్ అన్నట్టుగా వచ్చిన వార్త వింటే.. చదివితే కూడా కోపం వచ్చేసింది. దాంతో పాటు కొంత విచిత్రంగా కూడా అన్పించింది. కేసీఆర్ చెప్పినట్టుగా వచ్చిన వార్త ఏమిటంటే.. ‘నా కూతురు ఎమ్మెల్సీ కవితను పార్టీ మారమని బీజేపీ కోరింది.’. సీఎం కూతుర్నే పార్టీ మారాలని అడుగుతరా..? అడుగుతరా..? ఎంత ధైర్యం ఈ బీజేపీకి అనుకుంటుంటే.. వెంటనే ఓ డౌట్ కూడా వచ్చేసింది. కేసీఆర్ కూతురును పార్టీ మారాలని అడగాలంటే.. ఎవరైన మధ్యవర్తులు రాయభారం నడపాల్సిందే. నడపాలంటే..పార్టీ మారే ఆలోచన కవితకు రాదంటే రాదు. ఎందుకంటే రాకుమారి. ఎట్లాగు కాబోయే సీఎం కేటీఆర్ కదా.. నీకు ఇక్కడేం పని, ఆ బీజేపీ ఉంది గోతికాడి నక్కలెక్క. నువ్వు రెడీ అంటే చాలని ఎవరైన మోటివేట్ చేసి ఉండాలి. అయితే అసలు కవితను పార్టీ మారాలని బీజేపీ అడిగిందా..? లేకుంటే మొన్న నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ కోరిన వాళ్ల మాధిరిగా ఇంకెవరైన ట్రై చేశారా.? అనుమానమే. ఇక్కడ ఇంకో సంగతి గుర్తుకొచ్చింది. మోదీ మొదటి గవర్నమెంట్ సమయంలో కవిత ఎంపీ. అప్పుడు పేపర్లలో తరచూగా ఒక స్టోరీ వచ్చేది. కవితకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు అని. అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ మంచి దోస్తు కూడా. అందుకే అన్ని బిల్లులకు అంటే నోట్ల రద్దు, జీఎస్టీ ఇంకా వగైరా వగైరా డైరెక్ట్‌గా లేకుంటే ఇన్‌డైరెక్ట్‌గా మద్దతు ఇచ్చాడు. అందుకే కవితకు మంత్రి వర్గంలో చోటు వార్తకు మంచిగా వచ్చేదీ. అందరూ దీన్ని నమ్మారు కూడా. ఎందుకో ఏమో కానీ కవిత మంత్రి కాలేదు. 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయారు. ఆమె కల కాదు కాదు ఈ వార్తలు రాసిన మీడియా కల నెరవేరలేదు. సో ఇప్పుడు కవితను పార్టీ మారాలని బీజేపీ కోరినట్టుగా సాక్షాత్తు సీఎం అందునా కేసీఆర్ చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే. అంతకు మించి మార్గం కూడా లేదు.