ఒక్కోసారి ఇంట్లో కూడా మనకు నచ్చిన భోజనం దొరకదు. పైగా ఇంట్లో కూడా రెండు కూరలు.. అది కూడా అందరికీ నచ్చినవే వండాల్సి వస్తుంది. హోటల్ వెళ్లినా వాళ్ల మెనూ ప్రకారమే తినాల్సినవి ఎంచుకోవాలి.అందుకే మనకు మనసుకు నచ్చిన భోజనం దొరికితే పండుగే. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ నీకు నచ్చిన భోజనమే అందుబాటులోకి తేనుంది. ప్రయాణాల్లో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూ మార్చుకొనే వెసులుబాటును ఐఆర్‌సీటీసీకి కల్పిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. చిరుధాన్యాలతో చేసే స్థానిక ఉత్పత్తులనూ మెనూలో భాగం చేసుకోవచ్చని పేర్కొంది. పండగల వేళ ప్రత్యేక ఆహార పదార్థాలు సైతం విక్రయించవచ్చని పేర్కొంది. నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్ రైళ్లలో మెనూను ఐఆర్‌సీటీసీ నిర్ణయిస్తుందని తాజా నోట్‌లో రైల్వే బోర్డు ప్రకటించింది.