పత్రికల్లో సంపాదకీయం.. దీనికి ఉన్న విలువ వెలకట్టలేనిది. ఏ పేజిలో ఎలాంటి వార్తలు వచ్చినా.. సంపాదకుడు రాసే రాతలు సమాజం కోసం ఉంటాయి. ఉండితీరాలి. ఈ సంపాదకీయమే.. పత్రికను ఉన్నతంగా నిలబెడుతుంది. అలాంటి సంపాదకీయాలే.. వన్‌సైడ్‌గా మారితే ఇక విలువలెక్కడున్నాయి. అంతర్గత వలువలు ఊడిపోయి సిగ్గు పోవడం తప్ప. తెలుగు పత్రికలు ఏనాడో తమ పై దుస్తులు విడిచేశాయి. వొక్కో పత్రిక వొక్కో పార్టీకి అండగా నిలబడి ఉన్నాయి. ఎంత పెద్ద సంఘటన జరిగినా.. తాము మద్దతుగా నిలబడిన పార్టీకి ప్రయోజనం చేకూరే రాతల తర్వాతే.. మిగిలినవి అచ్చేయడానికి ప్లేస్. దీనికి ఎంతో దూరం పోయి వెతకాల్సిన పని లేదు, నిన్నగాక మొన్న ఏపీలో జల ప్రళయం విరుచుకొని పడితే.. పై దుస్తులు విడిచేసిన పత్రికలు.. టీవీలు చంద్రబాబు కన్నీటి బొట్లకే పత్రికలు విలువిచ్చాయి. ఏపీ అసెంబ్లీలో ఏం జరిగిందో స్పష్టత లేదు కానీ చంద్రబాబు మాత్రం తన భార్య భువనేశ్వరీపై మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత కామెంట్లు చేశారంటూ మీడియా సమావేశంలో ఏడ్చేశారు. ఆయన చేయదలుచుకుంటే ఇదే విషయంలో అసెంబ్లీ వద్దే రచ్చ చేయవచ్చు కానీ ఎందుకో మీడియా సమావేశంలోనే ఆయన ఏడ్చేశారు. స్పాట్ విషయాన్ని వదిలేసి.. ఇప్పుడు సంపాదకీయం వద్దకు వద్దాం. ఆంధ్రజ్యోతికి పేరుకు కే శ్రీనివాస్ ఎడిటర్. కానీ పూర్తిగా ఆ పత్రిక ఓల్ అండ్ సోల్ రాధాకృష్ణ నిర్ణయాలుంటాయి. సాక్షి విషయానికొస్తే ఎడిటర్ వర్దెల్లి మురళి. కానీ ఆయన చేతుల్లో ఏమీ ఉండదు. నిర్ణయాలన్నీ జగన్ అండ్ కో. ఈ రెండు పత్రికల్లో ఈరోజు సంపాదకీయాలు చదివితే.. అంతర్గత వలువలు కూడా విడిచేశారని నిర్ణయానికి రాక తప్పదు.
ఆంధ్రజ్యోతి సంపాదకీయం పేజీలో ఆ పత్రిక ఓల్ అండ్ సోల్ రాధాకృష్ణ ‘సభ– సంస్కారం’ రాశారు. సభా.. సంస్కారాలపై రాయడానికి ఎవరూ వద్దనరు. చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావించడంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ ఎక్కడ స్టార్ట్ అయి.. ఎక్కడికి వచ్చిందో ఉండాలి. అదేమీ లేకుండా చంద్రబాబు అండ్ కో చెప్పిన విషయాల ఆధారంగా కథను అల్లుకొని రాశారు. చంద్రబాబును భుజాలపైకి ఎత్తుకొని మోశారు. మాధవరెడ్డి, లోకేశ్‌కు డీఎన్ఏ పరీక్ష అంటూ వైసీపీ కామెంట్ చేసిందని పేర్కొన్నారు. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికలను తీసుకొచ్చారు. ఇంకా రెండున్నరేళ్లు ఉన్న ఎన్నికల గురించి ఇప్పుడు ప్రస్తావించం ఎందుకు..? అంటే 2004 ముందస్తు ఎన్నికల ముందు చంద్రబాబు చేతికి కట్టుకట్టుకొని ఎలా ఉమ్మడి ఏపీలో పర్యటించారో.? ఇప్పటి నుంచి 2024 నుంచి రెండున్నరేళ్లు వరకూ ‘భువనేశ్వరీ’ పేరుతో ఎపిసోడ్ నడిపించాలన్న నిర్ణయానికి వచ్చినట్టుంది. సభలో జరిగిన సంగతేమో రాబోయే రెండున్నరేళ్లు ఇదే ప్రచారం. ఆయన ఏమేం రాసుకొచ్చారో.. అంతా రాయలేం కానీ అంతా వన్సైడ్ రాసుకొచ్చారని చెప్పక తప్పదు.
ఇక సాక్షి విషయానికొస్తే ఆ పత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళి రాసిన ‘ఆ కళ్లలో వాటర్లూ..!’ పూర్తిగా వన్‌సైడే. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ తప్పేమీ లేదు. అంతా చంద్రబాబు అండ్ కో మాత్రమే అంటూ రాసుకొచ్చారు. ముందుగానే చంద్రబాబు ఏడుపును అపహాస్యం చేశారు. చేతిని అడ్డుపెట్టుకొని ఏడ్చారు నీళ్లొచ్చాయా..? అన్నట్టు అపహాస్యం చేశారు. ‘కన్ను తడిచిందా..? కన్నీరు కనిపించిందా.? సందేహాలు అనవసరం. తడి కన్పించినా కన్పించకపోయినా ఆయన కన్నీరు పెట్టుకున్నట్టే లెక్క. ఏడ్చుటయే ఎరుగని రాజకీయ చతురుడు. ఇప్పడెందుకు ఏడ్చాడు’ అంటూ కామెంట్ చేశారు. ఆయన రాసుకొచ్చిందంతా ఇక్కడ రాసుకోలేం కానీ అంతా వన్‌సైడే అని చెప్పక తప్పదు.
‘ఆ కళ్లలో వాటర్లూ..!’ చదవుకోండి
మొత్తానికైతే తెలుగు మీడియా తన విలువల వలువలను పూర్తిగా వదిలేసి.. వ్యవహరిస్తోంది. ఏ మీడియాకు ఆ మీడియా తమకు నచ్చిన వ్యక్తులు.. పార్టీలపై ఒక రకంగా. నచ్చని వ్యక్తులు.. పార్టీలపై మరోరకంగా రాసుకుంటున్నాయి. ఇవి ఎంత రాసుకున్న ప్రజలు అంత గుడ్డివాళ్లైతే కారు. ఏది నిజం. ఏదీ అబద్ధమో..? వారికీ తెలుసు.
Chandrababu చుక్కల కన్నీరు ముందు జల ప్రళయం సాటిరాదా..!
నీ ఆదర్శ విలువల పాత్రికేయం ఇదేనా ఈనాడు..!