ఒకరి అస్తమయం.. ఎందరికో ఆగమనంగా మారుతుందంటారు. అలాంటి ఒక రాజకీయ శక్తి అస్తమైతే..ఆ ఖాళీని పూడ్చడానికి ఒకరి తర్వాత ఒకరు దిగుతా అంటున్నారు. దిగుతున్నారు.
తమిళ రాజకీయాల్లో స్టార్ డమ్ జయలలిత, కరుణానిధి. వీరిద్దరూ అస్తమించారు. కరుణానిధి చేసిన ఖాళీని పూడ్చడానికి ఆయన కొడుకు స్టాలిన్.. కూతురు కనిమొళి సన్నద్ధంగా ఉన్నారు. జయలలిత ఖాళీని పిలప్ చేసే వారే లేరు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో స్థాపించిన వారి కుటుంబమే సర్వం. ఆ కుటుంబంలో సమర్ధుడైన వ్యక్తి లేకుంటే కాలగర్బంలో కలిసి పోతాయి. ఇలా కాలగర్భంలో కలిసి పోవడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అవి ఏఏ పార్టీలో రానున్న రోజుల్లో తేలిపోతాయి. ఇప్పుడు జయలలిత ఖాళీ చేసిన ప్లేస్‌ను పిలప్ చేయడానికి నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు. వీరిలో కమల్‌హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ బరిలోకి నిలవడానికి రెడీగా ఉంది. రజనీకాంత్ చిద్విలాసంగా నవ్వుతున్నారే కానీ పోటీపై క్లారిటీ ఇవ్వడం లేదు.
ఈ సంగతి పక్కన పెడితే.. నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ తరువాత ఆ స్థాయిలో పాపులారిటీ ఉన్న నటుడు విజయ్. ఆయన అభిమానులు సంఘాలుగా ఏర్పడి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లో వస్తారని వార్తలొస్తున్నాయి. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతుగా విజయ్ మక్కల్ ఇయక్కం పని చేసింది. అప్పుడప్పుడు విజయ్ చేసే ప్రసంగాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయి. ‘తలైవా’, ‘కత్తి’ వంటి చిత్రాల్లో విజయ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం లేపాయి. ‘మెర్సల్’ చిత్రంలో బీజేపీని, ‘సర్కార్’ చిత్రంలో అన్నాడీఎంకేను తూర్పార పట్టారు విజయ్. ఈ ఏడాదే విజయ్ ఇల్లు, ఆఫీసు, ఆయనకు సంబంధించిన సినీ నిర్మాతల ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరిపారు. విజయ్ మక్కల్ ఇయక్కం భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థగా మారుతుందని ఈ మధ్యే విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్ చెప్పారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటములు, నటుడు కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం బరిలో నిలవడం ఖాయమైంది. అదే సమయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రారంభించి పోటీ చేస్తారని ప్రచారమూ జరుగుతోంది.
ఈ క్రమంలోనే నటుడు విజయ్ కూడా పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వినవస్తున్నాయి. అందుకే విజయ్ తన పనయూర్ ఫాంహౌస్‌లో అభిమాన సంఘాల నిర్వాహకులతో వరుసగా సమావేశమవుతున్నారు. తనకున్న పాలోయింగ్, తన సినిమాల్లోని డైలాగ్‌లకు కొడుతున్న చప్పట్లను దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లోకి రావడానికి రెడీ అయినట్టున్నారు. ఈ ఫాలోయింగ్.. చప్పట్లు రాజకీయాల్లో ఉపయోగపడుతాయా.? నమ్మకంగా చెప్పడం కష్టమే. ఎందుకంటే సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వారందరూ ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు కాలేరు. విజయకాంత్‌లు, చిరంజీవులు కూడా అవుతారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న వారిలో ఎందరు ఎన్టీఆర్‌లు అవుతారో..? ఎందరు చిరంజీవులు అవుతారో చూడాలి.