Home breaking news స్వడబ్బా.. పరడబ్బా.. పరస్పర డబ్బ.. నిజం చెప్పిన సీఎం కేసీఆర్

స్వడబ్బా.. పరడబ్బా.. పరస్పర డబ్బ.. నిజం చెప్పిన సీఎం కేసీఆర్

296
0

–వికాస్​ రుషి

ముఖ్యమంత్రి కేసీఆర్​ మాదిరిగా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎవరూ మాట్లాడరని గతంలో మనం అనుకున్నాం. అదే నిజమని అందరూ అంగీకరిస్తారు. ఎవరున్నారు.. ఎవరేమన్నా అనుకుంటారా..? అన్న మీమాంసకు ఆయన పోరు. తాను చెప్పదలుచుకున్నది అది అబద్ధమైనా..? వాస్తవమైనా సరే ఈజీగా చెప్పేస్తారు. ఆయన చెప్పింది అవతలి వ్యక్తులు కచ్చితంగా వింటారు ఆ టైంలో.  ఆ తరువాత సంగతి తరువాతే. ఈ ప్రస్తావన సంగతి ఎందుకొచ్చిందంటే.. టీవీ–9 చానల్​ నిర్వహించిన ‘నవ నక్షత్ర సన్మానం–2019’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్​ వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్​ను సన్మానించారు. ఆ తరువాత కేసీఆర్​ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్​ తాను చెప్పదలుకున్నది చెప్పేశారు. అదే ‘స్వడబ్బ.. పర డబ్బ..పరస్పర డబ్బ’ అంటూ చెప్పారు. ఆయన ఈ మాట అనగానే.. అక్కడున్న వారందరూ నవ్వేశారు. ఎందుకంటే.. ఈ సన్మాన కార్యక్రమాల్లో ఏం జరుగుతుందో.. ఏం మాట్లాడుతారో..? ఆయన చెప్పేశారు. ఇక్కడ ఎవరెవరినీ ప్రశంసించాలో.. వారిని ప్రసంశించారు.

మీడియాను ఏమనదలుచుకున్నాడు. తాను ఏమనుకుంటున్నాడో దాన్నే అన్నారు. బతకడం కోసం సంచలనాలు విచక్షణ లేకుండా రాయడం.. ప్రసారం చేయకూడదంటూ.. కంటి వెలుగు కార్యక్రమంపై వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ మెత్తగా హెచ్చరించారు.  రామేశ్వరరావు కొనుగోలు చేయక ముందే.. ఎంతో ఎత్తుకు ఎదిగిన టీవీ–9పై ప్రశంసలు గుప్పించారు. ఈ ప్రశంసలు  ఏ విధంగా చూసినా..  రవి ప్రకాశ్​కే దక్కుతాయి. రామేశ్వరరావు తీసుకున్న తరువాత కొత్తగా విస్తరించింది ఏమీ లేదు. మోజో అనే టీవీ మూతపడడం తప్ప. సీఎం కేసీఆర్​ టీవీ–9ను  ప్రశంసించారు. ఇదే టీవీని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నిషేధించిన సంగతి తెలిసిందే. కాకుంటే.. ఆనాడు రవి ప్రకాశ్​ ఓనర్​. ఈ సంగతి పక్కన పెడితే.. తాను ఏం చేశారో.. ఈ వేదికపై చెప్పుకున్నారు. కొత్తగా చెప్పుకున్నది ఏమీ లేదు. ఎప్పటికీ చెప్పేదే. చివరకు ఆయన చెప్పిందేమిటంటే.. ‘స్వ డబ్బ.. పర డబ్బ.. పరస్పర డబ్బ’ అంటే తన డబ్బ తాను కొట్టుకోవడంతో పాటు ఎదురుగా ఉన్న వారి డబ్బ కొట్టాలి. ఇద్దరు పరస్పరం డబ్బ కొట్టుకోవాలి. టీవీ 9 వారు గొప్పవారు. నేను గొప్పవారిని. పరస్పరం గొప్పవాళ్లమని డబ్బ కొట్టుకోవాలి. ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి లేకుంటే దోమలగూడ అంటే తామకకాడ అన్నట్టు ఉంటదని మాత్రం చెప్పేశారు. అందరూ నవ్వేశారు. ఎందుకంటే ఆయన నిజం మాట్లాడారు కదా. ఆయన నిజం మాట్లాడకున్నా.. అందరూ వింటారు. ఎందుకంటే ఆయన అందరూ నచ్చే విధంగా మాట్లాడుతారు కాబట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here