Home breaking news రోడ్డు మీదకు 50 వేల కుటుంబాలు.. బతుకు ‘బస్టాండే’నా.?

రోడ్డు మీదకు 50 వేల కుటుంబాలు.. బతుకు ‘బస్టాండే’నా.?

87
0
ఆర్టీసీ బస్సులు

సీఎం కేసీఆర్​కు కోపమొచ్చింది. ఒక్క ఆర్టీసీ సంస్థ.. దాదాపు 50 వేల కుటుంబాలు. ఇప్పుడు రోడ్డున పడబోతున్నాయా..? వారందరి బతుకు బస్టాండేనా..? ఇప్పటికిప్పుడే సమాధానం చెప్పలేని ప్రశ్నలు. ఉద్యమ సమయంలో ఇదే ఆర్టీసీ ఉద్యోగులు.. కేసీఆర్​ను నెత్తికెత్తుకున్నారు. సకల జనుల సమ్మెలో వారి పాత్ర కీలకమే. ఎవరూ కాదనలేరు. ఆ సమ్మె నాటి జీతం ఇప్పటికీ రాలేదంటారు. ఆరోజు తెలంగాణ కోసం సమ్మెకు దిగారు.  ఇదే కేసీఆర్​ చేత శహబాష్​ అన్పించుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్​ (టీఆర్​ఎస్​) అనుబంధ సంస్థ టీఎంయూను గెలిపించారు. అప్పటివరకూ ఆదిపత్యం చెలాయించిన ఎన్​ఎంయూ, ఎంప్లాయిస్​ యూనియన్​ను కార్మికులు మట్టి కరిపించారు.  

ఆ మధ్యనే.. సమ్మె చేయడానికి ప్రయత్నిస్తే.. లొంగే ప్రసక్తే లేదని కేసీఆర్​ హెచ్చరించారు. అప్పుడు ఆర్టీసీ ఉద్యోగులే లొంగిపోయారు. ఈ మధ్యనే ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అక్కడ విలీనం ప్రకటన రాగానే.. తెలంగాణ కార్మిక సంఘాలు.. ఇక్కడ కూడా కేసీఆర్​ విలీనం చేస్తారేమో అనుకున్నారు. కానీ చేయలేదు. అదే డిమాండ్​పై సమ్మె నోటిసిచ్చారు. ఇక్కడే కేసీఆర్​ అహం దెబ్బతిన్నదని ఆయన గురించి తెలిసిన వారు  చెబుతున్నారు.

ఇక్కడే 2003లో జయలలిత ముఖ్యమంత్రిగా  ఉండగా.. తమిళనాడులో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల హూస్టింగ్​ ప్రక్రియ గుర్తుకొస్తోంది. ఒక్క కలం పోటుతో 1.75 లక్షల మందిని ఆమె ఉద్యోగంలోంచి తొలగించారు. ఆ సమయంలో ఉద్యోగులందరూ న్యాయస్థానాలను ఆశ్రయించినా.. ఏమీ జరగలేదు. చివరకు ఆ ఉద్యోగులే జయలలితను శరణుజొచ్చడం.. ఆమె కూడా దయతలచి పోలీసు కేసుల్లో ఇరుక్కున్న వారిని తప్ప మిగిలిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఆనాడు ఉద్యోగులను అడ్డం పెట్టుకొని ఆమెను రాజకీయంగా దెబ్బతీయడానికి డీఎంకే ప్రయత్నించింది. ఇది తెలుసుకొని జయలలిత అటువంటి నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు ఇక్కడ ఏ ప్రతిపక్షం గట్టిగా లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక ఎవరూ లేరు. కేవలం ఏపీలో జరిగిన విలీనాన్ని చూసి.. ఆశతో వీరు సమ్మెకు దిగారు. కేసీఆర్​కు కోపమొచ్చింది. నన్నే ధిక్కరిస్తారా.? అన్న ఆవేశం వచ్చింది. విధుల్లోకి రాని వారందరి ఉద్యోగాలు పోయాయని ప్రకటించేశారు.  మొత్తం 50 వేల మంది కార్మికులు.. అంటే 50 వేల కుటుంబాలు. ఇప్పుడీ తెలంగాణలో ఒకే ప్రశ్న.. తలెత్తుతోంది. ఉద్యమ నాయకుడు అంటే ఇలానే ఉంటారా..? అని ఇది సమాధానం లేని ప్రశ్న. 50 వేల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడబోతున్నాయా..? వాళ్ల బతుకు బస్టాండేనా..? ఇది కూడా ఇప్పుడే సమాధానం చెప్పలేని ప్రశ్నే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here