Home breaking news యాదాద్రి పాత ఆలయమే.. కొత్తగా ప్రారంభముండదు – ‌‌సీఎం కేసీఆర్

యాదాద్రి పాత ఆలయమే.. కొత్తగా ప్రారంభముండదు – ‌‌సీఎం కేసీఆర్

111
0
ఆలయాన్ని పరిశీలిస్తున్న కేసీఆర్​

యాదగిరిగుట్ట పాత ఆలయమే అని కొత్తగా ఎలాంటి ప్రారంభాలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. గుట్ట పునరుద్దరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొత్తగా నిర్మిస్తున్నది కాదు కాబట్టీ, ఎలాంటి ప్రారంభోత్సవం ఉండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తరువాత శాస్త్రోక్తంగా పూజలు, దర్శనాలు యధావిధిగా పాత పద్ధతిలోనే కొనసాగుతాయని చెప్పారు. యాదాద్రి దేవస్థానం పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన దేవాలయం పనులు తుది దశకు చేరుకున్నాయని మిగిలిన కొద్దిపాటి పనులను రాబోయే రెండు మూడు నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు.

దేవాలయ పునరుద్దరణ పనుల కోసం ఇప్పటి వరకు రూ. 692 కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్​ ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి నెలలో యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని తలపెట్టినందున ఈలోగానే కాటేజీల నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పన పూర్తి కావాలని ఆదేశించారు.  ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణంలోనూ, గుడి అంతర్గత పనులలోను జాప్యం జరుగుతున్నదని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పిన పనులు చెప్పినట్టు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టెంపుల్ సిటీలో 250 కాటేజీలు నిర్మించడానికి రూ. 400 కోట్లు విరాళాలు ఇవ్వడానికి వివిధ కార్పోరేట్ సంస్థలు, దాతలు సిద్ధంగా ఉన్నందున పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గుట్టకింది భాగంలో ప్రస్తుతమున్న గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి వీలుగా తీర్చిదిద్దాలని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఈ చెరువును నింపడానికి అనువుగా కాలువ నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here