Home breaking news మెద‌క్ ఎంపీ గెలిచినా.. సిద్దిపేట‌లో మెజారిటీ త‌గ్గింది- కేటీఆర్‌

మెద‌క్ ఎంపీ గెలిచినా.. సిద్దిపేట‌లో మెజారిటీ త‌గ్గింది- కేటీఆర్‌

158
0

హైద‌రాబాద్ః వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా తాను ఎక్క‌డా ఫెయిల్ కాలేద‌ని మాజీమంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో గెలిస్తే ఎవ‌రూ కిరీటాలు పెట్ట‌లేద‌న్నారు. అభ్య‌ర్థుల ఎంపిక స‌రైంది కాద‌న్నా వార్త‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్న కేసీఆర్ ప్ర‌క‌ట‌న కార‌ణంగా టీఆర్ఎస్ న‌ష్ట‌పోయింద‌న‌డం స‌రికాద‌న్నారు. హ‌రీశ్‌రావును ప‌క్క‌న పెట్టామ‌న్నది స‌రికాద‌న్నారు. మెద‌క్‌లో ఎంపీ స్థానం గెలిచినా.. సిద్దిపేట (హ‌రీశ్‌రావు నియోజ‌క‌వ‌ర్గం)లో మెజారిటీ త‌గ్గింద‌ని విశ్లేషించారు. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నికలు క‌లిసి వ‌స్తే.. టీఆర్ఎస్‌కు న‌ష్టం జ‌రిగేద‌న్న వాద‌న కూడా క‌రెక్ట్ కాద‌న్నారు. నిజామాబాద్‌లో క‌విత ఓడిపోవ‌డానికి రైతులు కార‌ణం కాద‌ని, అక్క‌డ నామినేష‌న్లు వేసింది రైతుల పేరుతో రాజకీయ కార్య‌క‌ర్త‌ల‌ని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ క‌లిసి ప‌ని చేశాయ‌ని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేర‌డం వ‌ల్ల ఓడిపోయామ‌ని చెప్ప‌డం కూడా క‌రెక్ట్ కాద‌న్నారు. మోదీ హ‌వా కార‌ణంగానే.. రాష్ట్రంలో బీజేపీ గెలిచింద‌ని, ఆ పార్టీకి కార్య‌క‌ర్త‌లు లేని చోట కూడా ఓట్ల ప‌డ్డాయ‌ని తెలిపారు. ఆదిలాబాద్ గెలుస్తామ‌ని బీజేపీ కూడా ఊహించి ఉండ‌ద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. వెంట్రుకవాసి తేడాతో కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింద‌ని చెప్పుకొచ్చారు. అంద‌రూ క‌ష్ట‌ప‌డినా.. ఫ‌లితాలు ఈ విధంగా వ‌చ్చాయ‌ని, ఇది మాకు ఎదురు దెబ్బ‌కాదు అని చెప్పారు. గ‌త ఎన్నికల కంటే తమ‌కు ఓట్లు పెరిగినా.. సీట్లు త‌గ్గాయ‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో విచిత్ర‌మైన ట్రెండ్ క‌న్పించింద‌ని, కేవ‌లం మోదీ కార‌ణంగానే.. ఇటువంటి ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. ఒక వేళ ఈ ఎన్నిక‌ల్లో 16 సీట్లు మేము గెలిచినా.. కేంద్రంలో మేము ఏం చేయ‌లేక పోయేవార‌మ‌ని చెప్పారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ లాంటి వాళ్ళే ఓడిపోయారని, కొందరు ముఖ్యనేతలు ఓడిపోయినంత మాత్రానా.. టీఆర్ఎస్ కార్యకర్తల నైతిక స్థయిర్యం దెబ్బతింటున్నదనేది నిజం కాదన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికి 4 ల‌క్ష‌ల ఓట్లు మాత్రం త‌గ్గాయ‌ని చెప్పారు. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామ‌ని ఎక్కువ‌ సీట్లు గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై లోతైన సమీక్ష చేస్తామ‌ని చెప్పారు. తాను, క‌విత ఎన్నో డ‌క్కా మోక్కీలు తిన్నామ‌ని, ఈ ఓట‌మికి కుంగిపోమ‌న్నారు. అమేథీలో రాహుల్ ఓడిపోయారు.. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు దుప్పట్లు కప్పుకుని ఇంట్లో పడుకుంటారా ? అని ఎదురు ప్ర‌శ్నించారు. హాజీ పూర్ ఘటనపై మాట్లాడుతూ కొందరు శవాల పై పేలాలు ఏరుకుంటున్నారు అలాంటి రాజకీయం మేము చేయమ‌ని, బాధితులకు న్యాయం చేస్తామ‌న్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల పై వివాదాన్ని కూడా కావాల‌నే కొందరు వ్య‌క్తులు గోరంత విష‌యాన్ని కొండంత‌లు చేశార‌ని చెప్పుకొచ్చారు. గ్లోబరీనా కు నాకు సంబంధం ఉందని పనికి మాలిన వాళ్ళు విమర్శలు చేశారన్నారు. ఏపీ లో జగన్ గెలిచారని రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ పై నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం కేసీఆర్ కానీ తాను కాద‌ని స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here