Home తాజా వార్తలు మహిళల భాగస్వామ్యంతో సామాజిక మార్పు- వెంక‌య్య‌

మహిళల భాగస్వామ్యంతో సామాజిక మార్పు- వెంక‌య్య‌

206
0

హైద‌రాబాద్ః దేశాభివృద్ధిలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించడం ద్వారా వేగవంతమైన పురోగతి సాధించవచ్చని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు సైతం మహిళలకు ఆర్థిక అక్షరాస్యత కల్పించడం మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యత ద్వారా మహిళా సాధికారత అంశం మీద హైదరాబాద్ లో జరిగిన జాతీయ సదస్సుల్లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే శక్తి కలవారిగా మహిళలను తీర్చిదిద్ది, స్వశక్తి కలిగిన భాగస్వాములుగా దేశాభివృద్ధిలో వారికి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత ద్వారా మహిళా సాధికారతను సాధించే క్రమాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా ఉన్న భారత దేశ వృద్ధి రేటు 2020 నాటికి 7.5 శాతానికి పెరుగుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసిందన్న ఉపరాష్ట్రపతి, వచ్చే ఐదేళ్ళలో 5 లక్షల డాలర్ల ఆర్థికవృద్ధిని దేశం లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఈ క్రమంలో మహిళా భాగస్వామ్యాన్ని మరింత పెంచి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రమేయం లేకుండా సామాజిక మార్పు సాధ్యం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. బాలికలు, మహిళలకు ఆర్థిక అక్షరాస్యత కల్పించడం మరియు వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ దిశగా వారిని ముందుకు తీసుకువెళ్ళవచ్చని, సమానమైన మహిళల ఆర్థిక భాగస్వామ్యం ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన సాధించడం మాత్రమే కాకుండా, దేశపురోభివృద్ధికి బాటలు వేస్తాయని తెలిపారు. లింగ సమానత్వం అనేది పౌరులందరికీ సంబంధించిన అంశమని, అది కేవలం మహిళకు మాత్రమే సంబంధించినదిగా భావించొద్దన్న ఉపరాష్ట్రపతి, మహిళల ఆర్థిక అక్షరాస్యత లింగ వివక్షను రూపు మాపి, సురక్షితమైన మహిళ భవిష్యత్తుకు తోడ్పాటునందిస్తుందని తెలిపారు. “సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులిద్దరూ రెండు బండి చక్రాల వంటి వారు, సమాజం అనే పక్షి ఎగరాలంటే రెండు రెక్కలుండాలి, ఒక రెక్కతో సాధ్యం కాదు” అన్న వివేకానందుని మాటలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఆర్థిక అక్షరాస్యత ఉన్న మహిళలు పొదుపు మరియు పెట్టుబడుల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలరన్న ఉపరాష్ట్రపతి, గ్రామీణ మహిళలకు సాంకేతి పరిజ్ఞానం పట్ల కూడా అక్షరాస్యత కల్పించాలని, వారి ఉత్పత్తులను అమ్మేందుకు, వాటికి ప్రచారం కల్పించుకునేందుకు సాంకేతికత సహకారం తీసుకునే విధంగా వారికి అక్షరాస్యత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. మహిళా పొదుపు సంఘాలు ( డ్వాక్రా), స్వయం సహాయ సంఘాలు ఒక విజయవంతమైన ఉద్యమమని, దాన్ని దేశ వ్యాప్తంగా మరింత పటిష్ఠపరచాలని, ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతంలో ఈ దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని, ముద్రా బ్యాంకు యోజన కూడా మహిళా సశక్తీ కరణకు తోడ్పడుతందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆర్థికాభివృద్ధికి మహిళల ఆర్థిక అక్షరాస్యత అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్న ఉపరాష్ట్రపతి మహిళల ఆర్థిక అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here