Home తాజా వార్తలు బీజేపీ మ‌త‌త‌త్వ పార్టీ – క‌మ్యూనిస్టులు శ్రమ జీవులు *సాక్షి* కితాబు

బీజేపీ మ‌త‌త‌త్వ పార్టీ – క‌మ్యూనిస్టులు శ్రమ జీవులు *సాక్షి* కితాబు

109
0
  • వికాస్ రుషి

ప‌త్రిక‌ల‌కు సొంత భాష్యం ఉండ‌కూడ‌దు. సొంత భాష్యం చెప్పుకోవడానికి ఎడిట్ పేజీ అని ఒక‌టి ఉంది. మిగిలిన పేజీల్లో వార్త‌లు వార్త‌లుగా రాయాలి. లేదంటే విశ్లేషించాలి. కానీ ప‌త్రిక‌లు తమ సొంత పైత్యాన్ని వార్త‌లుగా మలిచి రాస్తున్నాయి. ఈ జాబితాలో ప‌లానా ప‌త్రిక లేద‌ని చెప్ప‌డానికి వీల్లేకుండా ఉంది. ఒక్కో పార్టీకి ఒక్కో ప‌త్రిక. తమ పార్టీకి సంబంధించి ఒక ర‌క‌మైన క‌థ‌నం. వేరే పార్టీ గురించి ఇంకో ర‌క‌మైన క‌థ‌నం. జాతీయ స్థాయి సంగ‌తి ప‌క్కన పెడ‌దాం. తెలుగు రాష్ట్రాల్లోని ప‌త్రిక‌లు టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల జెండా మోస్తున్నాయి. క‌మ్యూనిస్టుల సంగ‌తి స‌రే స‌రి వాటికి నాలుగు దిన‌ప‌త్రిక‌లున్నాయి. స‌రే నా పైత్యం ప‌క్కన పెట్టి.. అస‌లు విష‌యానికి వ‌ద్దాం. ఈ రోజు సాక్షి పత్రిక‌లో వ‌చ్చిన ఒక క‌థ‌నంలో బీజేపీని మ‌త‌త‌త్వ పార్టీగా పేర్కొంది. అదే స‌మ‌యంలో క‌మ్యూనిస్టుల‌ను శ్రమ జీవుల పార్టీగా కితాబిచ్చింది. క‌థ‌నం రాసిన తీరు.. చూస్తే.. బీజేపీ మ‌త‌తత్వ పార్టీ అని సాక్షి ప‌త్రిక అభిప్రాయంగా ఉంది. క‌థ‌నం ఇలా మొద‌లైంది.

కాషాయంతో బెంగాల్ కమ్యూనిస్టుల దోస్తీ!

శ్రామికవర్గం కోసం పోరాటమే పునాదిగా పుట్టుకొచ్చిన కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మతతత్వ పార్టీకి మద్దతిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజకీయ నీతిని ఒంటబట్టించుకున్న కమ్యూనిస్టులు బెంగాల్‌లో తృణమూల్‌ను ఓడించేందుకు బీజేపీకి లోపాయికారీగా సహకరిస్తున్నారు. 34 ఏళ్ల తమ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండి కొట్టడమే కాక తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీని గద్దెదింపడం కోసం సీపీఎం శ్రేణులు క్షేత్ర స్థాయిలో బీజేపీకి సహాయసహకారాలు అందిస్తున్నాయి. బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలని కమలనాథులు కష్టపడుతున్నారు. అయితే, చాలా నియోజకవర్గాల్లో బూత్ స్థాయిలో వారికి బలం లేదు. దాంతో ఆయా స్థానాల్లో ఊహించని వర్గాల (సీపీఎం కార్యకర్తలు) మద్దతుపై ఆధారపడుతున్నారు.*

ఇలా సాగిపోయింది క‌థ‌నం. ఈ క‌థ‌నాన్ని చ‌దివిన వారు.. క‌చ్చితంగా ఇది ప‌త్రిక అభిప్రాయంగానే గుర్తిస్తారు. స‌రే ఈ సంగ‌తి పక్కన పెడ‌దాం. బీజేపీ, క‌మ్యూనిస్టులు ఈ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తున్నాయా..? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం కాద‌నే వ‌స్తుంది. ఎందుకంటే గ‌తంలో ప‌లు సంద‌ర్బాల్లో ఈ రెండు పార్టీలు, ఇతర పార్టీల‌తో క‌లిసి పోటీ చేశాయి. క‌లిసి అధికారాన్ని కూడా పంచుకున్నాయి.

1967లో క‌లిసి పోటీ
భార‌తీయ జ‌న‌సంఘ్(బీజేపీకి పూర్వ‌రూపం), సీపీఐ, స్వతంత్ర‌పార్టీ, సోష‌లిస్ట్ పార్టీ, కాంగ్రెస్ నుంచి విడిపోయిన గ్రూప్ క‌లిసి సంయుక్త విధాయ‌క్ ద‌ళ్గా ఏర్ప‌డ్డాయి. ఈ పార్టీల‌న్నీ క‌లిసి రాజ‌స్థాన్, బిహార్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో పోటీ చేశాయి. క‌లిసి ప్ర‌భుత్వాల‌ను కూడా ఏర్పాటు చేశాయి. నాటి మంత్రివ‌ర్గంలో క‌మ్యూనిస్టులు, జన సంఘీయులు ఉన్నారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా బీజేపీ,క‌మ్యూనిస్టులు క‌లిసి పోటీ చేశారు. 1984లో బీజేపీ, క‌మ్యూనిస్టులు, టీడీపీ క‌లిసి ఉమ్మ‌డిగా పోటీ చేశాయి. ఆనాటి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి చందుప‌ట్ల జంగారెడ్డి హ‌న్మ‌కొండ నియోజకవ‌ర్గం నుంచి పోటీ చేశారు. అప్ప‌ట్లో వ‌రంగ‌ల్ జిల్లాలో బ‌ల‌మైన పార్టీలుగా ఉన్న ఉమ్మ‌డి క‌మ్యూనిస్టులు మ‌ద్ద‌తుతో జంగారెడ్డి గెలిచారు. దేశ‌వ్యాప్తంగా బీజేపీ గెలిచిన రెండు సీట్ల‌లో హ‌న్మ‌కొండ ఒక‌టి. మొన్న‌టి బెంగాల్ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌మ్యూనిస్టులు మ‌ద్ద‌తుగా నిలిచి మ‌రీ గెలిపించారు.

క‌మ్యూనిస్టులు, కాషాయిస్టులు క‌లిసి పోటీ చేసి.. అధికారం పంచుకున్న సంద‌ర్భాలుంటే… వీట‌న్నింటిని మ‌రిచి మ‌త‌త‌త్వ పార్టీ బీజేపీతో శ్రామిక‌వ‌ర్గం కోసం ఏర్పాటైన క‌మ్యూనిస్టులు క‌లిసి పని చేస్తున్నారంటూ సాక్షి కితాబు. క‌థ‌నాల విష‌యంలో ఎల‌క్ట్రానిక్ మీడియాతో ఫ్రింట్ మీడియా పోటీ ప‌డుతున్న‌ట్టుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here