Home జాతీయం బాధ్య‌త‌ల నుంచి రాహుల్ పారిపోయారా..?

బాధ్య‌త‌ల నుంచి రాహుల్ పారిపోయారా..?

175
0

హైద‌రాబాద్ః కాంగ్రెస్ బాధ్య‌త‌ల‌ను వ‌దిలి రాహుల్ పారిపోయారా..? ఇప్పుడు దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న‌ చ‌ర్చ ఇదే. ఇటీవల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో లాభ‌ప‌డిన చోట కూడా ఓట‌మే ఎదురైంది. ఈ ఓట‌మికి నైతిక బాధ్య‌త‌గా రాహుల్ కాంగ్రెస్ అధ్య‌క్ష‌ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని మే 25న జ‌రిగిన పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో వెల్ల‌డించారు.

ఈ అంశంపై నెల రోజుల‌కు పైగా పార్టీలో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ.. మీరు రాజీనామా నిర్ణ‌యాన్ని ఉప సంహ‌రించుకోవాల‌ని కోరారే.. త‌ప్ప‌.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన వారెవ‌రూ క‌న్పించ‌లేదు. నైతికంగా ఓట‌మి బాధ్య‌త‌ను ఎవ‌రూ పంచుకోలేదు. ఇక్క‌డే ఆయ‌న మ‌న‌సు నొచ్చుకున్న‌ట్టుగా ఉంది. అందుకే గ‌త వారం ఓట‌మికి నేనొక్క‌డినే బాధ్యుడినా..? అన్నట్టుగా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ త‌రువాతే రాహుల్‌కు మ‌ద్ద‌తుగా రాజీనామాల ప‌ర్వం మొద‌లైంది. అయినా ఆయ‌న విన‌కుండా రాజీనామాకు క‌ట్టుబ‌డి పక్క‌కు జ‌రిగారు.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. బాధ్య‌త‌ల నుంచి రాహుల్ పారిపోయారా..? అన్న చ‌ర్చ‌కు వ‌ద్దాం. యోధుడు అనే వాడు యుద్ధంలో ఓడినా.. మ‌రింత‌ ప‌ట్టుద‌ల‌తో యుద్ధానికి దిగుతాడు. అది గెలుపు సాధించే వ‌ర‌కూ నిరంత‌రం యుద్ధం చేస్తూనే ఉంటాడు. కానీ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మొద‌టి ఓట‌మి ఎదురు కావ‌డంతో రాహుల్ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. రాహుల్ మాధిరిగా ఓడిన వెంట‌నే ఇందిరా గాంధీ ఆనాడే బాద్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటే.. కాంగ్రెస్ అనే పార్టీ అప్పుడే చ‌రిత్ర‌లో క‌లిసి పోయేదీ. మొద‌టిసారి ఓడిన ఆమె.. మ‌ళ్లీ ఎన్నిక‌ల కధ‌న రంగంలోకి దిగి ఘ‌న‌ విజ‌యం సాధించారు. ఆ త‌రువాత రాజీవ్ హ‌యాంలోనూ కాంగ్రెస్‌కు ఓట‌మి ఎదురైంది. కానీ ఆయ‌న కూడా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోలేదు.

భార‌తీయ జ‌న‌సంఘ్ ను ఆనాటి ప్ర‌ముఖులు అట‌ల్ బిహ‌రీ వాజ్‌పేయ్‌, ఎల్‌కే అద్వానీ.. జ‌న‌తా పార్టీలో విలీనం చేశారు. ఆ ప్ర‌యోగం విఫ‌ల‌మైన త‌ర్వాత‌.. బీజేపీని ఏర్పాటు చేశారు అట‌ల్ బిహరీ వాజ్‌పేయ్‌, ఎల్‌కే అద్వానీ. బీజేపీ ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన మొద‌టి ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీ గెలిచింది కేవలం రెండు సీట్లే. ఈ రెండు సీట్ల‌తో మేమేం చేస్తామ‌ని.. ఆనాడే బీజేపీని వారిద్ద‌రు వ‌దిలేసి ఉంటే… ఈనాడు బీజేపీ అధికారంలోకి వ‌చ్చేదే కాదు. నిరంతరం ఎన్నిక‌ల క‌ధ‌న‌రంగంలో పోరాటం చేశారు. 1998, 1999లో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు బీజేపీకి చెందిన న‌రేంద్ర‌మోదీ రెండోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. విదేశీ మ‌హిళ‌గా ప్ర‌ధాని ప‌ద‌వికి దూర‌మైనా.. రెండుమార్లు మ‌న్మోహ‌న్ సింగ్‌ను ప్ర‌ధానిగా చేసిన‌.. సోనియా.. రాజ‌కీయ చ‌క్రం తిప్పారు.

జాతీయ రాజ‌కీయాల నుంచి ప్రాంతీయ పార్టీల వైపున‌కు వ‌ద్దాం.. ఉమ్మడి ఆంధ‌ప్ర‌దేశ్‌ను తీసుకుంటే.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తొమ్మిది నెల‌ల్లోనే.. రికార్డ్ స్థాయిలో సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చారు. సీన్ క‌ట్ చేస్తే.. ఐదేళ్ల త‌ర్వాత ఘోరంగా ఓడిపోయారు. చివ‌ర‌కు ఎన్టీఆర్‌ను కూడా ఒక స్థానంలో ప్ర‌జ‌లు ఓడించారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ నాయ‌క‌త్వంలోనే తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చింది. చంద్ర‌బాబు అధికారం హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం.. తొమ్మిదేళ్లు అధికారంలోకి కొన‌సాగ‌డం జరిగింది. ఈ తొమ్మిదేళ్ల‌లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రావ‌డానికి ఎంత చేయాలో అంత చేసి 2004 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

2004 నుంచి 2014 వ‌ర‌కూ కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గా.. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. వెన‌క్కి త‌గ్గ‌కుండా. 2014 ఎన్నిక‌ల వ‌ర‌కూ పార్టీని న‌డిపించి.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ముఖ్య‌మంత్రి అయ్యారు. చివ‌ర‌గా.. 2014లో ఓడిపోయిన వైఎస్ జ‌గ‌న్‌.. ఏడాదిన్న‌ర పాటు ప్ర‌జ‌ల్లో తిరిగి.. 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించారు.

తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు.. టీఆర్ఎస్‌ను స్థాపించిన త‌ర్వాత ఎన్నో ఢ‌క్కా మోక్కీలు తిన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను వైఎస్ రాజ‌శేఖ‌ర‌ర‌రెడ్డి చీల్చ‌డం, పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చడానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు. అయిన‌ప్ప‌టికీ.. 14 ఏళ్ల‌పాటు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా.. రాజ‌కీయాల్లో కొన‌సాగుతూ ప‌ట్టుబిగించారు. ఇప్పుడు రెండోమారు ముఖ్య‌మంత్రి అయ్యారు.మ‌నం పైన పేర్కొన్న వారిలో గెలిచి ఓడి.. ఓడి గెలిచిన వారు క‌న్పిస్తారు. కానీ మ‌ధ్య‌లో వెళ్లిపోయిన వారు ఎవ్వ‌రూ క‌న్పించ‌రు.

కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా రాహుల్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత 2019 లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో మొద‌టి ఓట‌మి. ఈ ఒక్క ఓట‌మికే.. రాహుల్‌ ఇలా ప‌క్క‌కు జ‌రిగిపోయాడు. ఓట‌మి గెలుపున‌కు నాంది. దీన్ని గుర్తించిన వాడు విజ‌యాలు సాధించే వ‌ర‌కూ పోరాడి యోధుడిగా నిలుస్తాడు. అలాంటి వారి జాబితానే ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌స్తావించుకున్నాం. స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఓట‌మి వెనుకే గెలుపు దాగి ఉంటుంద‌ని గుర్తించ‌ని వ్య‌క్తి రాహుల్ ఒక్క‌రే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here