Home ఎడ్యుకేషనల్/జాబ్స్ “ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణాభివృద్ధి ”

“ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణాభివృద్ధి ”

134
0

ఏప్రిల్ 24 పంచాయ‌తీరాజ్ దినోత్స‌వం

  • భాస్క‌ర్‌రెడ్డి

భారతదేశం గ్రామంలో నివసిస్తున్నది. మన దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. గ్రామాల ద్వారానే రామరాజ్యం సిద్ధిస్తుంది అని జాతిపిత మహాత్మా గాంధీ తెలిపారు. ఆయ‌న‌ ఆలోచనలు ఆచారణాత్మకంగా జరగాలన్న, ప్రజాస్వామ్యం పరిఢవిల్లి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలి. వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్పించేలా, ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజలు భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి.

చరిత్రను పరిశీలిస్తే బుద్ధుడి కాలం నుండి మన దేశంలో స్థానిక సంస్థలు ప్రజా మద్దతును కూడుగట్టి, అభివృద్ధి పథంలో గ్రామాలను తీర్చిదిద్దాయి. ఆ తర్వాత మౌర్యుల, చోళుల కాలంలో స్థానిక సంస్థలను కేంద్రంగా మలిచి ఆదర్శపాలనను ప్రజలకు అందించారు. బ్రిటీష్ పాల‌కులు స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేశారు. స్వాతంత్య్రానంతరం గ్రామీణాభివృద్ధి అంతంత మాత్రంగానే జ‌రిగింది. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత ఒక పటిష్టమైన, రాజ్యాంగబద్దమైన స్ధానిక సంస్థలుగా కొత్త రూపును సంతరించుకున్నవి. అలాగే సమాఖ్య స్పూర్తిని కొనసాగిస్తు కేంద్రం, స్థానిక సంస్థలను రాష్ట్ర జాబితాలో చేర్చారు. గ్రామ స్వరాజ్ అనేది సంపూర్ణ గణతంత్ర స్వాతంత్య్రం మరియు పరస్పర ఆధారం అనే ఆదర్శ అంశాలపై ఆధారపడి ఉంటుందని భావించిన మేధావులు గ్రామ పంచాయతీల ఏర్పాటును ఆదేశిక సూత్రాలలో అమర్చి సుపరిపాలనా విధానాన్ని నొక్కి చెప్పారు.

స్థానిక స్వపరిపాలన అనగా ప్రజల దైనందిన అవసరాలను తీర్చి వారి సమస్యలను, పరిష్కరించడం కోసం స్థానిక సంస్థలకు ఈ భాధ్యత అప్పగించారు. సమస్యలు సులభంగా పరిష్కరించేలా, అధికార వికేంద్రీకరణ జరిగి సుపరిపాలన అందించడం. స్వాతంత్యానంతరం మన ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణా పథకాలతో ప్రజల భాగస్వామ్యానికి బీజం నాటారు. ఆ తర్వాత బల్వంత్‌రాయ్, అశోక్ మెహతా వాంటి వారితో సమితులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలో అధికారం వికేంద్రీకరణ రాజ్యాంగ బద్ధంగా స్థానిక సంస్థలకు నిధులు, విధులను బదిలి చేయాలని, షెడ్యూలు కులాల తెగలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించి వారి భాగస్వామ్యాన్ని క‌ల్పించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు 50% మహిళా రిజర్వేషన్ కల్పించి మహిళా భాగస్వాములను కూడా పెంపొందించారు. ఆర్థిక సంఘం ద్వారా, ఎం.పి. ల్యాడ్స్ ద్వారా వచ్చే నాధులను సక్రమంగా అభివృద్ధి దిశపై ఖర్చు చేసేలా ప్ర‌య‌త్నాలు జ‌రుతున్నాయి.

భారత దేశంలో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి గతపాలకులు మేధావులు చేసిన సూచనలు పరిశీలించి జరిగిన అభివృద్ధిని పంచాయతీరాజ్ దినోత్సవాన గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. కేంద్ర ప్రభుత్వాల ప్రజల భాగస్వామ్యం కల్పించాలని ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాలలో అవస్ధాపనా సౌకర్యాలు కల్పించే ప్రయత్నం జరుగుచున్నది. గ్రామీణ మహిళా భాగస్వామ్యంతో మహిళా సాధికారిత సాధించే విధంగా చేశారు. పేదరిక నిర్మూలన దేశంగా అనేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువై కొద్దిపాటి విజయాన్ని నమోదు చేశారు. గ్రామీణ నిరక్ష్యరాసులను అక్షరజ్ఞానం కలిగించేందుకు సాక్షర భారత్ పేరుతో అక్షరాస్యత పెంచేలా ప్రతయ్నం జరిగింది. కాని ఇంకా విద్య సంబంధ విషయాలలో మెరగుపడాల్సి ఉంది. ప్రతీ మారుమూల గ్రామాన్ని మండల, జిల్లా, కేంద్రాలతో రోడ్డు సౌకర్యం కల్పించేలా సడక్ యోజనా పేరుతో అనుసంధానించేలా చేసారు. మాతా శిశు మరణాలను తగ్గించే విధంగా పిహెచ్‌సిలను ఏర్పాలు చేసారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విద్య, ఆరోగ్య, ఆహారాలను అందిస్తున్నారు. గ్రామీణ పేద మహిళలకు వంట చెరకు అందించడం ద్వారా కలిగే అనారోగ్యంను గుర్తించి ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చి పర్యావరణాన్ని రక్షించేలా చర్చలు తీసుకున్నారు. పట్టణాలలో అందించే పౌర, సామాజిక, సేవలను గ్రామీణ ప్రాంతాలలో కల్పించే విధంగా రూర్బన్ పేరుతో ఒక వినూత్న ఆలోచనను కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులకు కొంత సహాయ సహకారాలు చేసినా ఇంకా చేయాల్సిన పనులు ఆచరణాత్మకంగా జరిగేలా, రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా, వ్యక్తిగత, సామాజిక అభివృద్ధిని కేంద్రీకరణ జరిగే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ ప్రాంతంలోని స్ధానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసి, అవస్ధాపనా సౌకర్యాలు కల్పించకుండా, అక్కున చేర్చుకోకుండా కల్లోలిత ప్రాంతాలుగా పేర్కొంటూ గ్రామీణాభివృద్ధిని గాలికొదిలేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పాలకులు చేసిన తప్పిదాలను గుర్తించి, అనేక వినూత్న, విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతలలో అనేక కులాల వారి జీవనాధారం చెరువులతో ముడిముడి ఉందని గ్రహించి మిషన్ కాకతీయ పేరుతో చెరువులు పునర్ నిర్మాణం జరిపే ప్ర‌య‌త్నాలు చేశారు.

“పంచాయతీ వ్యవస్థ అనేది సంకూచిత, ప్రాంతీయ రాజకీయ కుహరాలకు ప్రతీతి” అని చెప్పిన అంబేడ్కర్ మాటలను గుర్తెరిగి స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్దత కల్పించినా ఇప్పుడు రాజకీయ పెనుగులాటలో పడి అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ నాయకులు ప్రజలను పార్టీల ఆధారంగా విభజిస్తూ జూదపు క్రీడా వేదికలుగా తయారు చేస్తున్నారు. పేరుకే 50% మహిళా రిజర్వేషన్స్ ఉన్నా పెత్తనం మాత్రం వారి కుటుంబీకులదే అవుతుంది. అవస్ధాపనా సౌకర్యాలు అనుకున్న విధంగా కల్పించలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాల్సిన నిధులను అందించలేక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించలేక పోతున్నారు. కూటీర పరిశ్రమలను నెలకొల్ప లేక స్వయం ఉపాధికి కావాల్సిన శిక్షణను అందించలేకపోతున్నాయి. ముఖ్యంగా ఎంజిఎన్‌ఆర్‌ఇజి ను సక్రమంగా వినియోగించుకోవట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో రైతులకు భీమా సౌకర్యం లేనేలేదు. వ్యవసాయాధితర పరిశ్రమలను నెలకొల్పలేక వ్యవసాయనికి దూరంగా బ్రతికేలా నిరాశా, నిసృ్పహలకు లోనయ్యేలా చేస్తున్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలోని యువత ఉపాధి లేక నైరాశ్యానికి గురి అవుతున్నారు. అనుకున్న విధంగా అక్షరాస్యతా కూడా పెరుగలేదు. దేశానికి పట్టుకొమ్మలు అయిన గ్రామాలు అభివృద్ధి విషయంలో పట్టు కోల్పోతున్నాయి. స్థానిక ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలను తయారు చేయలేక, నిధులను రాబట్టుకోలేక సతమతమౌతున్నాయి.

స్థానిక సంస్థలు సమర్ధవంతంగా పనిచేయడానికి ఆర్థిక వనరులను సమకూర్చి సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఆసరాగా చేసుకొని, అవస్ధాపన సౌకర్యాల ఏర్పాటు వేగం పుంజుకోవలి. ప్రజలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి పేదరిక, నిరుద్యోగ నిర్మూలన జరిగేలా, ప్రాథమిక విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపర్చాలి. పట్టణాలలో లభించే మౌళిక వసతులను గ్రామీణ ప్రాంతాలలో అందించేట్టు వ్యసవ్థలను బలోపేతం చేయాలి. యువకులకు ఉద్యోగ కల్పన కోసంకుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి స్వావలంబన సాధించేట్లు దోహద పడాలి. రైతులకు మద్దతు ధర కల్పిస్తూ పంట నష్టాలకు భీమా సౌకర్యం సక్రమంగా అందేట్టు చేసి ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసి ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలి. వ్యవసాయాధారిత ఫుడ్ ఇన్‌డస్ట్రీస్‌ను నెలకొల్పాలి. పర్యావరణ సంరక్షణకై చెట్లను నాటడాన్ని ఒక ఉద్యమంలా చేయాలి. ముఖ్యంగా గ్రామీణ సమస్యలైన త్రాగునీరు, పారిశుద్ద్యంను అదిగమించి స్వచ్ఛభారత్‌ను చేయాలి. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి. రాజకీయంగా ప్రజాస్వామ్య భావాలు బలపర్చడానికి అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి సామాజికంగా నూతన నాయకత్వ భావం ఆవిర్భవించడానికి పరిపాలనా పరంగా ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా స్థానిక స్వపరిపాలన సంస్థలు అవతరించాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సత్వర నిర్ణయాలను పంచాయతి కార్యదర్శుల్లాంటి గ్రామ స్ధాయి ఉద్యోగులతో అమలు చేయిస్తూ ప్రతి పల్లెను ఆదర్శ గ్రామమైన గంగదేవి పల్లిలా మారేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కాదు ప్రజల భాగస్వామ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థలను రాజకీయ పరమైన పాత్రకంటే కూడా పరిపాలన పరమైన పాత్రను పోషించడానికే మనమంత మద్దతివ్వాలి.

  • భాస్కర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here