Home ఎడ్యుకేషనల్/జాబ్స్ పోస్టింగ్ ఇవ్వకుంటే ఛ‌లో ఢిల్లీ- ఆర్ కృష్ణ‌య్య‌

పోస్టింగ్ ఇవ్వకుంటే ఛ‌లో ఢిల్లీ- ఆర్ కృష్ణ‌య్య‌

154
0

హైద‌రాబాద్ః పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయిన 8792 టీచర్లకు వారం రోజులలో పోస్టింగ్స్ ఇవ్వకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర సెలెక్టెడ్ టీచర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. జాతీయ ఎస్సీ, బీసీ క‌మిష‌న్ల‌కు ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. సెలెక్టెడ్ టీచ‌ర్ల సంఘం స‌మావేశం శ‌నివారం జరిగింది. గుజ్జ కృష్ణ అద్యక్షత జ‌రిగిన స‌మావేశంలో వివిధ అంశాల‌పై చ‌ర్చించిన త‌రువాత‌ నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జాతీయ బీసీ సంఘం అధ్య‌క్షుడు ఆర్ కృష్ణ‌య్య మాట్లాడారు. సెలెక్టెడ్‌ టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బందేమిట‌ని ప్ర‌శ్నించారు. కావాల‌నే ఉద్దేశ పూర్వ‌కంగా స‌ర్కారు జాప్యం చేస్తోంద‌ని ఆరోపించారు. నెలకు రూ. 100 కోట్లు మిగుల్చుకోవాల‌ని జాప్యం చేస్తోంద‌న్నారు. ఆరు నెల‌లుగా ముఖ్యమంత్రి పేషిలో ఈ ఫైలును పెండింగ్ లో ఉంద‌న్నారు. ఈ ఫైలు పెండింగ్‌లో పెట్టి సెలెక్టెడ్ టీచ‌ర్ల‌కు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సెలెక్ట్ అయిన టీచర్లు ఎన్నోమార్లు ఆందోళ‌న‌లు చేసినా.. ఈ స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. పోస్టుల భర్తీకి ఎన్నికల్ కోడ్అ వరోధం కూడా కాదన్నారు. కోడ్ అమలులో ఉన్న సందర్భంలోనే ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి అనుమ‌తి తీసుకొని 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, అలాగే సోషల్ వెల్ఫేర్ లో 3,200 మంది  గురుకుల ఉపాధ్యయులకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన సంగ‌తిని గుర్తు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ త‌న‌కు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వానికి తొత్తుగా మారిందని విమర్శించారు. రాజ్యాంగ బద్దమైన పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్‌ అధికారులు, పౌరులకు రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాల‌రాస్తున్నాయన్నారు. 9 సంవత్సరాలుగా టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ
పాఠశాలలో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయ‌ని, 4600 ప్రభుత్వ పాఠ‌శాలలు మూతపడ్డాయ‌ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ స్టాఫ్ ను నియమించకుండ విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న‌దన్నారు. ఇంటర్ పరిక్ష ఫలితాలలో ఇంత‌ గందరగోళం జరుగడానికి సరియైన అధ్యాపకులు లేకపోవడం ప్రధాన కారణమ‌న్నారు. ఈ కార‌ణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌కుంటే ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం చేప‌డుతామ‌ని జాతీయ బీసీ, ఎస్సీ క‌మిష‌న్‌ను ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పారు. టీచర్ ఉద్యోగాల భర్తీని జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేయాలని కృష్ణయ్య సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీవ్ర జాప్యం జరుగుతుంద‌ని తెలిపారు. గ‌తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి 5 వేల టీచర్ పోస్టులను నాలుగు నెలల్లో భర్తీ చేసిన సంగ‌తిని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలల టీచర్ పోస్టుల భర్తీకి గతంలో మాదిరిగా జిల్లా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే ఏళ్ల తరబడి జరిగే జాప్యాన్ని నివారించవచ్చునన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, దాసు సురేష్, జి.అంజి, రమ్య,
G.కృష్ణ యాదవ్, నరసింహ నాయక్, నరేష్ గౌడ్, రాకేష దత్త ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here