Home తాజా వార్తలు పోలీస్ నియామ‌కాల్లో కుంభ‌కోణం – శ్ర‌వ‌ణ్ దాసోజు

పోలీస్ నియామ‌కాల్లో కుంభ‌కోణం – శ్ర‌వ‌ణ్ దాసోజు

64
0

హైదరాబాద్: పోలీస్‌ కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ జాతీయ‌ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. వాటి భర్తీని సజావుగా జరపాల్సిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌పీఆర్‌బీ) అనుసరించిన తీరుపై ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ బాగోతంపై ఉన్న స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 18,435 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీతోపాటు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇతర పోస్టుల భర్తీకి అయిదు ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువరించారని, ఒకో దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయల చొప్పున 7,19,840 దరఖాస్తులు వచ్చాయన్నారు. అయితే దరఖాస్తుదారులకు శాస్త్రీయ విధానంలో సమర్ధంగా పరీక్షలు నిర్వహించడంలో బోర్డు ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. మొత్తం 2,24,741 మంది అభ్యర్థులు శరీరదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారని, వారిలో 1,17,660 మందిని అర్హులుగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తేల్చిందని, ఒక నిర్ధిష్ట విధానం లేదా శాస్త్రీయ పద్ధతి లేకుండా ఎంపిక ప్రక్రియను అనుసరించారని విమర్శించారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తొలిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్ఎఫ్ఐడి) ట్యాగ్స్‌ ద్వారా అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించారని, కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి వచ్చిన అభ్యర్థులకు నిర్వహించిన ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు వినియోగించిన ఆర్ఎఫ్ఐడి ఒక ప్రైవేట్‌ ఏజెన్సీ ఇ–సాఫ్ట్‌ నియంత్రణలో ఉందనే విషయాన్ని ఆయ‌న‌ బట్ట బయలు చేశారు. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్‌ వినియోగం వల్ల వేలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేరువేరు పోస్టులకు అయిదు వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేసిన బోర్డు… మూకుమ్మడిగా ఒకేసారి ఫిజికల్‌ టెస్ట్‌లు, పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఎనిమిది వందల మీటర్లు (400/2) అర్హత సమయం 170 సెకన్లు, నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పై ఒకేసారి 50–60 మంది అభ్యర్థులతో పరుగు పోటీ నిర్వహించారని, దీని వల్ల ఎంతోమంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని ఆయన చెప్పారు. ఒలింపిక్‌ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో సైతం మిల్లీ నానో సెకన్‌ సమయాన్ని కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, అయితే తెలంగాణ సర్కార్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఆర్ఎఫ్ఐడి విధానంలో అభ్యర్థులు నష్టపోయేలా అశాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని మండిపడ్డారు. చివరికి తాము అనుకున్న ఎంపిక‌ వారినే చేశారని ఆయన ఆరోపించారు. అక్ర‌మాల‌కు సంబంధించి కొన్ని ఉద‌హార‌ణ‌లు చూపారు. మంత్రి రజిత 2016 రిక్రూట్‌మెంట్‌కు హాజరై, మెయిన్‌కు కూడా ఎంపికయ్యార‌ని, అదే వ్యక్తి 2018లో దరఖాస్తు చేసుకుంటే ఎత్తు లేదని చెప్పి (ఒక అంగుళం తక్కువగా ఉందని చెప్పి) అనర్హురాలిగా ప్రకటించడమేమిట‌ని ప్ర‌శ్నించారు. ఈ ఒక్క కేసును చూస్తే చాలు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునన్నారు. నిఖిల్‌ రాజ్‌ ఎత్తు 168 సెంటీమీటర్లని, అర్హతల్లో ఎత్తు 167.8 సెంటీమీటర్లని, అయితే ఆర్ఎఫ్ఐడి విధానంలో అతని ఎత్తు 172.5గా చూపిందని మరో ఉదాహరణ చెప్పారు. ముఖ్యంగా సంగారెడ్డి, నల్లగొండ ఎంపిక కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఎంపిక విధానంలో తీవ్రంగా నష్టపోయినట్లుగా ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఆర్ఎఫ్ఐడి బోర్డు చైర్మన్‌ శ్రీనివాస్‌రావు ఫిర్యాదుదారులైన బాధిత అభ్యర్థులను మార్చి 28, 29 తేదీల్లో స్వయంగా పలిపించుకున్నారని,వ‌చ్చిన‌ వారిని లోపలికి కూడా అనుమతించలేదని డాక్టర్‌ శ్రవణ్‌ విమర్శించారు.
Please Subscribe our Website And Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here