Home తాజా వార్తలు పగటి కలలు కంటున్న కేసీఆర్ – డా.కె.లక్ష్మన్

పగటి కలలు కంటున్న కేసీఆర్ – డా.కె.లక్ష్మన్

89
0

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. దేశంలో అధికారంలోకి రావడం ఖాయమైన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం అవుతుందన్నారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక నిర్ణయాల పట్ల భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి స్వతంత్రంగానే పోటీ చేస్తుందన్నారు. అందువల్ల బీజేపీ నాయకులు అందరూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అభ్యర్థులను ముందుగానే గుర్తించాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని డా. లక్ష్మన్ తెలిపారు. అసెంబ్లీ కోర్ కమిటీలో జడ్పీటీసీ, ఎంపీటీసీల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, జిల్లా కోర్ కమిటీకి అప్పగిస్తుందన్నారు. జిల్లా కోర్ క‌మిటీలో చర్చించిన తదుపరి రాష్ట్రం నుంచి వచ్చిన పరిశీలకల ఆధ్వర్యంలో తుది నివేదికను రాష్ట్ర పార్టీకి అందజేస్తుందన్నారు. ఎంపికైన జడ్పీటీసీ అభ్యర్థులకు రాష్ట్ర అధ్యక్షుడే బీఫార్మ్ జారీ చేస్తారన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కోసం వాట్సప్ నెంబర్ 9701730033 ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. గ్రామీణ స్థాయిలో బిజెపి బలపడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, అందరూ కష్టపడి పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ మంత్రులు డి.కె.అరుణ, విజయరామారావు, నాయకులు చింతా సాంబమూర్తి, మంత్రి శ్రీనివాసులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here