Home breaking news *తెలంగాణ* ప్ర‌యోగం.. ఇక ఆ మూడు రాష్ట్రాలూ బీజేపీ గూటికే

*తెలంగాణ* ప్ర‌యోగం.. ఇక ఆ మూడు రాష్ట్రాలూ బీజేపీ గూటికే

189
0
  • వికాస్ రుషి

కాలం మారుతున్న కొద్ది.. వీరు వార‌వుతారు. వారు వీర‌వుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలాగే ఉంది. న‌రేంద్ర‌మోదీ మ‌రోసారి ప్ర‌ధానిగా పీఠం మీద కూర్చోగానే..అధికారానికి కూత‌వేటు దూరంలో ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌. క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య‌మంత్రులు కూర్చోవ‌డానికి తెర‌వెనుక‌, తెర‌ముందు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. తెలంగాణలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండుమార్లు అమలు చేసిన విధంగానే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను అమ‌లు చేయ‌డానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వ‌రుస‌గా జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌నాథులు జెండా ఎగురువేశారు. నాలుగేళ్లు బీజేపీకి అనుకూలంగా ఉన్న వాతావ‌ర‌ణం 2018 చివ‌ర‌లో కాస్త ఎదురు తిరిగింది. ఆ కార‌ణంగా అప్ప‌టివ‌రూ నిస్తేజంతో ఉన్న కాంగ్రెస్‌.. చ‌చ్చి చెడి రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రాలు చేజిక్కించుకుంది. గుడ్డిలో మెల్ల అన్న‌ట్టుగా అప్ప‌టివ‌ర‌కూ అధికారంలో ఉన్న కర్ణాట‌క‌లో సంకీర్ణ స‌ర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బార్డ‌ర్ మీద గెలిస్తే.. రాజ‌స్థాన్‌లో కొంచెం మెరుగు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రీ మెరుగు. భ‌విష్య‌త్‌లో అవ‌స‌రం ప‌డుతుంది క‌దా.. అని క‌ర్ణాట‌క‌లో ఎక్కువ సీట్లు గెలిచి అప్ప‌టివ‌ర‌కూ.. త‌మ చేతిలో ఉన్న‌ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని జేడీఎస్ సిగ‌లో పెట్టింది కాంగ్రెస్‌. అప్ప‌టి నుంచి కర్ణాట‌క‌లో లుక‌లుక‌లే. పొద్దంతా కొట్లాట‌. రాత్రి పూట గుస గుస అన్న‌ట్టుగా స‌ర్కారు సాగిపోతోంది.

కేంద్రంలో మ‌న స‌ర్కారు వ‌స్తే అన్ని సెట్ అవుతాయ‌ని అనుకున్న కాంగ్రెస్‌కు ఎగ్జిట్‌పోల్స్ చుక్క‌లు చూపించాయి. బంప‌ర్ మెజారిటీతో మోదీ మ‌ళ్లా ప్ర‌ధాని కుర్చీ మీద కూర్చుంటాడ‌ని తేల్చాయి. ఎగ్జిట్‌పోల్స్ అలా తేల్చాయో లేదో..కాంగ్రెస్ చేతిలో ఉన్న ఓ మూడు రాష్ట్రాల‌ను తాను చేజిక్కించుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. తెలంగాణ‌లో కేసీఆర్ చేసిన ప్ర‌యోగాన్ని అమ‌లు చేయాల‌ని చూస్తోంది. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను త‌న గూటిలోకి ర‌ప్పించుకోవ‌డం ద్వారా కాషాయ జెండా ఎగుర‌వేయాల‌ని చూస్తోంది.

ఎగ్జిట్‌పోల్స్ త‌మ‌కు అనుకూలంగా అలా రాగానే.. ఇలా మధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ గ‌వ‌ర్న‌ర్ ఆనందిబెన్ ప‌టేల్‌కు బీజేపీ లేఖ రాయ‌నే రాసింది. స‌ర్కారు బ‌లం లేదు. వెంట‌నే నిరూపించుకోవడానికి వీలుగా అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాయ‌ల‌ని కోరింది. అక్క‌డే అస‌లే కాంగ్రెస్ అత్తెస‌రు మార్కుల‌తో పాస‌యింది. బీజేపీకి 109 వ‌స్తే కాంగ్రెస్‌కు 114 వ‌చ్చాయి. మూడు సీట్లు గెలిచిన ఎస్పీ, బీఎస్పీ ద‌యతో ముఖ్య‌మంత్రి కుర్చీ మీద క‌మ‌ల్‌నాథ్ కూర్చున్న‌డు. ఆయ‌న‌ను కుర్చీ మీద నుంచి దించాలంటే బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు అవ‌స‌రం. అవ‌స‌ర‌మైతే.. కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు లాగి.. స‌ర్కారు ఏర్పాటు చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగానే.. గ‌వ‌ర్న‌ర్‌కు బీజేపీ లేఖ‌.

ఇక రాజ‌స్థాన్ విష‌యానికొస్తే..అక్క‌డ కూడా బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య గెలుచుకున్న సీట్ల‌లో పెద్ద‌గా తేడాలేదు. కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటే.. బీజేపీ 73 సీట్లు గెలుచుకున్న‌ది. బీఎస్పీ ఆరు, సీపీఎం రెండు సీట్లు గెలుచుకోగా.. మిగిలిన 19 సీట్లు ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు గెలుచుకున్నాయి. ఇప్ప‌టికే త‌మ‌కు త‌గ్గిన సీట్ల‌ను భ‌ర్తీ చేసుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్పుడు కేంద్రంలో మ‌రోసారి అధికారంలోకి రానున్నందున.. ఈ రాష్ట్రంలోనూ బీజేపీ పావులు క‌దుపుతోంది.

ఇక మిగిలింది కర్ణాట‌క‌.. ఈ రాష్ట్రంలో 104 సీట్లు గెలుచుకున్న‌ బీజేపీ పెద్ద పార్టీగా నిలిచినా.. కాంగ్రెస్‌, జేడీఎస్ క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్ప‌టి నుంచి సంకీర్ణ స‌ర్కారులో లుకలుక‌లే. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు. సంకీర్ణ స‌ర్కారును కూల‌దోయాల‌ని బీజేపీ చేసిన ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ కాలేదు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. తాజాగా మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇలా మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే.. అలా ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య‌మంత్రులు ప‌ద‌వుల్లో కూర్చునే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈ రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ‌లు చేసిన‌ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను బీజేపీ అమ‌లు చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్ర‌య‌త్నాలు గ‌మ‌నించిన కాంగ్రెస్‌.. బీజేపీ ప్ర‌జాస్వామ్య‌న్ని ఖూనీ చేస్తోందంటూ విల‌పిస్తోంది. ఈ పార్టీ చేతుల్లో దేశం ఉన్న‌ప్పుడు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేసిందో గుర్తు చేసుకోవాలి. ఇదంతా నీవు నేర్పిన విద్య‌యే నీర‌జాక్ష‌అని క‌మ‌ల‌నాథులు అన‌క‌మాన‌రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here