Home breaking news జగన్ జైలుకు.. భారతి ముఖ్యమంత్రి.. ఆంధ్రజ్యోతిలో మసాలా కర్రీ

జగన్ జైలుకు.. భారతి ముఖ్యమంత్రి.. ఆంధ్రజ్యోతిలో మసాలా కర్రీ

778
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

–వికాస్​ రుషి

ఏపీ సీఎం వైఎస్​ జగన్​ జైలుకు పోతాడు. ఆయన భార్య భారతి ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటారు. ఇది ఈనాటి ఆంధ్రజ్యోతిలో మాంచి మసాలా దట్టించి వండిన నాన్​వెజ్​ కరిని ఓనర్​ రాధాకృష్ణ వండేశారు. ఆదివారం ఆదివారం వచ్చే కొత్త పలుకులో ఎప్పుడు మసాల దట్టించి కూరలు వండే రాధాకృష్ణ.. ఈసారి మరింత మసాలా దట్టించి వంట వండేయడంతో పాటు  జ్యోతిషుడి అవతారం కూడా ఎత్తేసి ఇలా జరుగుతుండొచ్చు అని వైసీపీ వాళ్లే అనుకుంటున్నరని చెప్పేశారు. ఇదంతా నిజమైతేనా అబ్బో కాలజ్ఞానం చెప్పేశాడు. అంటూ నొసటి మీద బొట్లు కూడా పెట్టేయవచ్చు. పూలదండలేసీ హారతులియ్యొచ్చు.

ఈనాటి కొత్త పలుకులో ఏముందో ఒకసారి చదవండి. ‘‘అవినీతి కేసులలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవ్వాలని బొత్సతోపాటు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ పడుతున్నారని వైసీపీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే తన స్థానంలో తన భార్య భారతిని నియమించే ప్రయత్నం జగన్మోహన్‌రెడ్డి చేస్తారనీ, అప్పుడు పార్టీలో చీలిక వస్తుందనీ వైసీపీలోని ఒక ప్రముఖుడు అంచనా వేస్తున్నారు. భారతికి, షర్మిలకు అస్సలు పొసగడం లేదనీ, ఫలితంగా కుటుంబంలో చీలిక వస్తుందనీ, అంతిమంగా పార్టీలో కూడా చీలిక వస్తుందనీ ఆయన జోస్యం చెప్పారు.”ఈ జోస్యం వైసీపీ నాయకుడు చెప్పాడో లేదో.. మనం రాసే వార్తల్లో మనము ఏమనుకుంటామో దాన్నే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. భావిస్తున్నారని అలవోకగా రాసేస్తుంటామనుకో. ఇది అదే విధంగా అన్పిస్తోంది.  

ఏళ్ల తరబడి నడుస్తున్న ఈ కేసులో జగన్​కు జైలు శిక్ష పడే అవకాశం ఇప్పట్లో ఉండదు. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ తలచుకుందని అనుకున్నా..ఆ పార్టీకి ప్రయోజనమేముంది. కొత్త పలుకులో ఆర్​కే పేర్కొన్నట్టు.. జగన్​ జైలుకు వెళ్తే.. వైసీపీ బలహీనపడుతుంది. తద్వారా బలపడేదీ టీడీపీ. టీడీపీ బలపడాలని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కోరుకోదు. ఇటు వైసీపీ, అటు టీడీపీ బలహీనపడాలనే కోరుకుంటుంది తప్ప  ఏదో ఒక్కటి బలహీనపడాలని కోరుకోదు.  చీలిక వస్తుందని వైసీపీ నేత నోట్లో తీర్థం పోయించిన ఆర్​కే.. ఇదేదో తానే సృష్టించినట్టుగా అనుకుంటారని అనుకున్నట్టున్నారు అందుకే.. మధ్యలో ఆర్​ఎస్​ఎస్​ను లాక్కొచ్చారు. ఆర్​ఎస్​ఎస్​ నేత పేరుతో రాసిన వ్యాఖ్యలు చూడండి. ‘ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు కూడా ఇటీవల హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా జరగబోయే పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతుందో మీరే చూస్తారుగా’’ అని ఆ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం.’ అని తన నాన్​వెజ్​ మసాలా కర్రీలో ఆర్​కే పేర్కొన్నారు.  ఇంకేమన్నారో చదవండి  ‘రాజధాని మార్పు విషయంలో వివాదం ముసురుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని చెబుతున్నారు.  జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా అప్రతిష్ఠపాలైన తర్వాత తమ ప్రణాళికను అమలుచేయాలని ఇటు బీజేపీ పెద్దలతోపాటు అటు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు కూడా తలపోస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఏపీ అధికార పార్టీలో నిజంగా చీలిక వస్తుందా? ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్‌రెడ్డి తప్పుకోవాల్సి వస్తుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నప్పటికీ రాజధాని వివాదం మాత్రం రగులుతూనే ఉంటుంది.’ ఇదండి జగన్​ పార్టీ చీలిక అంశంలో ‘ కొత్త పలుకు’లోని భాగం.

శభాస్ ఆర్కేజీ.  పౌరసత్వ చట్టం, ఎన్నార్సీ, ఎన్నార్పీ విషయంలోనే తలమునకలవుతున్న బీజేపీకి.. ఇప్పుడు ఏపీ రాజధాని గురించి పట్టించుకునే తీరిక లేదు. పైగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఏపీ రాజకీయాలు ఆ పార్టీకి అవసరం లేదు.  అంతవసరం కూడా లేదు. ఇద్దరు కొట్టుకొని ఎవడు బలవంతుడవుతాడో.. చూద్దాంలే అన్నట్టుగా ఉంది బీజేపీ వైఖరి. కాకుంటే ఆర్కేజీ తన మనుసులో అనుకున్నది  ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పేశాడు. అదేంటంటే.. ‘జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా అప్రతిష్ఠపాలైన తర్వాత తమ ప్రణాళికను అమలుచేయాలని ఇటు బీజేపీ పెద్దలతోపాటు అటు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు కూడా తలపోస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఏపీ అధికార పార్టీలో నిజంగా చీలిక వస్తుందా? ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్‌రెడ్డి తప్పుకోవాల్సి వస్తుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నప్పటికీ రాజధాని వివాదం మాత్రం రగులుతూనే ఉంటుంది.’ అని. ఈ అంశంలో అసలు సారాంశమేమిటంటే.. రాజధాని వివాదం రగులుతూనే ఉంటుంది. అవినీతి కేసులో జగన్​ జైలుకెళ్తాడు. సీఎం పీఠం కోసం వదిన.. మరదళ్లు కొట్టుకుంటారు. వైసీపీ చీలిపోతుంది. చివరకు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు.  అబ్బా ఆశ..  దోశ..  అప్పడం.. వడ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here