అందరూ అనుకున్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దెబ్బకు దెబ్బ తీశారు. ఇది అబద్ధమా..? నిజమా..? అన్న సంగతి పక్కన పెడితే.. చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎన్కౌంటర్ కేసులో ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అమిత్ షా హోంశాఖ మంత్రిగా ఉండగా.. మీడియా కేసులో మాజీ హోంశాఖ మంత్రి చిదంబరం అరెస్ట్ అయ్యారు.
2010లో..
అమిత్ షా.. గుజరాత్ హోంమంత్రిగా ఉండగా.. 2005లో సోహ్రబుద్ధీన్ షాహిక్ ఎన్కౌంటర్ జరిగింది. ఇది ఫేక్ ఎన్‌కౌంటర్‌గా ప్రచారం జరిగింది. ఈ కేసులో అయిదేళ్ల తరువాత (25 జూలై 2010) అమిత్ షాను అరెస్ట్ చేశారు. ఆయన మూడు నెలలు జైల్లో ఉన్నారు. ఈ సమయంలో చిదంబరం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు.
2019లో..
ఫొటో: ఇంటర్నెట్ నుంచి సేకరణ
2007లో చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాకు నిధుల సేకరణకు సహకరించారన్న కేసులో సరిగ్గా 2017లో సీబీఐ కేసు నమోదైంది. అమిత్ షా అరెస్టైన తొమ్మిదేళ్ల.. 27 రోజుల తర్వాత (21 ఆగస్టు 2019) చిదంబరాన్నిసీబీఐ అరెస్ట్ చేసింది.
కేసులు నమోదు కావడం.. అడపాదడపా అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. కానీ నిజా నిజాలు తేలడమో..? తేలిపోవడమో జరిగి పోతుంది. గతంలో అరెస్టైన షా కేసు తేలిపోయింది. ఇప్పుడు అరెస్టైన చిదంబరం కేసు నిరూపణ అవుతుందా.? తేలిపోతుందా.? అన్నది తర్వాత తేలుతుంది. కానీ.. చిదంబరం అరెస్ట్‌ను కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఖండించడమేమిటో అర్థం కాదు. కొడుకు కార్తి చిదంబరానికి ఆర్ధిక లబ్ది చేకూర్చిన విషయంలో చిదంబరంపై కేసులు ఉన్నప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు ఖండించాల్సిన అవసరమేమిటీ..? అరెస్ట్ విషయంలో చిదంబరం సహకరించినా..? సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తే విమర్శించడంలో అర్ధముంది. అరెస్ట్ చేయడానికి సీబీఐ ప్రయత్నిస్తే.. చిదంబరం హుందాగా వ్యవహరించకుండా తలుపులు మూసుకుంటే గోడదూకి మరీ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దీంట్లో సీబీఐ దూకుడెక్కడుంది. అత్యుత్సాహం ఎక్కడుంది. విపక్షాలకు విమర్శించాల్సిన అవసరమేంటో అర్థం కాదు.