Home జాతీయం గెలుపు కోసం పీకేకు మ‌మ‌త పిలుపు

గెలుపు కోసం పీకేకు మ‌మ‌త పిలుపు

129
0
  • వికాస్ రుషి

విజ‌యం వ‌రించిందా..? అప్ప‌టివ‌ర‌కూ ఎదురైన వైఫ‌ల్యాలు మ‌టుమాయం. ప‌రాజ‌య‌మే మిగిలిందా..? నిన్నెవ‌రూ గుర్తుంచుకోరు. ప్ర‌శాంత్ కిశోర్ (పీకే) అనే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌కు ఇదే అనుభవం ఎదురైంది. విజ‌యాలు సాధించిన‌ప్పుడు అంద‌రూ ఆకాశానికెత్తాశారు. ఒక్క పరాజ‌యంతో ప‌ట్టించుకోని స్థితికి చేరుకున్నాడు. తిరిగి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘ‌న‌ విజ‌యం.. మళ్లీ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇప్పుడు ప‌శ్చిమ‌బెంగాల్లో తిరిగి విజ‌యం సాధించ‌డానికి పీకేను ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పిలిపించుకున్నారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యం వెనుక పీకే అన‌బడే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఉన్నారు. ఆ త‌రువాత ఆయ‌న బీజేపీని ఒదిలి 2015లో బిహార్ నితీశ్ కుమార్ పంచ‌న చేర‌డం.. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ విజ‌యం సాధించ‌డం జ‌రిగిపోయింది. ఆ త‌ర్వాత 2017లో పంజాబ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌క్షాన.. అక్క‌డా విజ‌య‌మే. ఇన్ని విజ‌యాలు సాధించ‌డంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్కే ప‌ని చేశారు. కానీ అక్క‌డ ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. అంతే ఆయ‌న‌ను కాంగ్రెస్ ప‌క్క‌న పెట్టింది, అప్ప‌టివ‌ర‌కూ సాధించిన విజ‌యాలన్నీ ప‌క్క‌కు పోయాయి. ప‌రాజ‌య భారంతో ఉన్న పీకేను 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం అల్లాడి ఓడిపోయిన‌ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలిపించుకున్నారు. స‌రిగ్గా రెండేళ్ల క్రితం రాజ‌కీయ స‌ల‌హాదారుడిగా నియ‌మించుకున్నారు. ఇందుకు పెద్ద ప్యాకేజీ ఉంద‌ని ప్ర‌చారం. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. పీకే రూపొందించిన న‌వ‌ర‌త్నాలు, ఏపీలో ఒక మ‌లుపు. ఈ న‌వ‌ర‌త్నాల‌ను జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం.. అందులో కొన్ని తాను అమ‌లు చేస్తాన‌ని ఆప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం.. జ‌రిగిపోయింది. అధికారంలో ఉన్న వ్య‌క్తి క‌దా ప్ర‌జలు బాబు వైపు మొగ్గుచూపుతార‌ని భావించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర షెడ్యూల్ ను మించి మ‌రికొన్ని రోజులు జ‌నంలోనే ఉన్నారు. పీకే వ్యూహం.. జ‌గ‌న్ క‌ష్టం క‌లిసి ఏపీలో ఘ‌న విజ‌యం సాధించారు. ఈ విజ‌యంతో మ‌రోసారి పీకే వార్తల్లో నిలిచారు.

ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌యిన ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. ఈ పీకేను పిలిపించుకున్నారు. వీరిద్ద‌రి స‌మావేశం కోల్‌క‌తాలో జ‌రిగింది. 2021లో జ‌రిగే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల కోస‌మే వీరిద్ద‌రి స‌మావేశం జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా ఎదుగుతున్న బీజేపీని నిల‌వ‌రించ‌డం కోసమే.. జ‌రిగిన స‌మావేశం రెండున్న‌ర గంట‌ల పాటు జ‌రిగింది. మ‌మ‌తతో క‌లిసి ప‌ని చేయ‌డానికి పీకే కూడా అంగీక‌రించారు. అయితే ఒప్పందం వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు కూడా ఈ విష‌యంలో స్పందించ‌లేదు. మ‌రో రెండేళ్లు స‌మ‌య‌ముంది. ఈ పీకే ఎలాంటి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తారో చూడాల్సిందే. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ పీకే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు మాత్ర‌మే ప‌ని చేసి ఆ పార్టీల‌ను అధికారంలోకి తీసుకొచ్చే ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. విజ‌యం సాధించారు. బిహార్ ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను నిల‌వ‌రించి.. నితీశ్‌కుమార్‌ను సీఎం చేసే విధంగా ప్ర‌ణాళిక‌లు ర‌చించి, మ‌హాఘ‌ట్భంధ‌న్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు తొలిసారిగా అధికారంలో ఉన్న తృణ‌మూల్ కాంగ్రెస్‌కు ప‌ని చేస్తున్నారు. ఫ‌లితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక్క‌డ ఇంకో విష‌యం.. ఆయ‌న జ‌న‌తాద‌ళ్ (యూ) నాయ‌కుడు కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here