Home breaking news కేసీఆర్ కత్తికి పదునెక్కువే.. రిపబ్లిక్ డే నాడు ఎన్ని తలకాయలు లేచిపోతాయో

కేసీఆర్ కత్తికి పదునెక్కువే.. రిపబ్లిక్ డే నాడు ఎన్ని తలకాయలు లేచిపోతాయో

214
0
తెలంగాణ భవన్​లో సంతకం పెడుతున్న కేసీఆర్​

–వికాస్​ రుషి

ఎవరేమనుకున్నా.. అనుకోకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్​ కత్తికి పదునెక్కువ. కత్తి అంటే అదేదే ‘దమ్ము’ సినిమాలో జూనియర్​ ఎన్టీఆర్​ కత్తి పట్టుకొని ఇరగదీసి  నరికినట్టు కాదుసుమా. మాట మాట అన్నట్టు. ఆయన చెప్పిందే వేదం. ఆయనను కాదంటే కష్టం. ఎందుకంటే ఆయన రాజు. ఈ మాట మనం గతంలో కూడా చెప్పుకున్నాము.  ఈ కత్తిని మనం కేసీఆర్​ చేతిలో  ఎందుకు పెట్టామంటే… నిన్నటికి నిన్న అన్ని పత్రికల్లో బ్యానర్​ ఐటంలోని హెడ్డింగ్​ డైలాగులు అలాగున్నాయి మరి అందుకే మనం కూడా కత్తిని పట్టేసినం. సారాంశమేమిటంటే.. జనవరి 22న 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్​.. మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశను చూపించి నిర్దేశం చేసి అన్నింటిలో మనం గెలవాల్సిందే అని కచ్చితంగా చెప్పేశారు. దాంతో పాటు ‘ఓడితే వేటు తప్పదు’ అని హెచ్చరించాడు కూడా. మున్సిపాలిటీల్లో గెలుపు బాధ్యత మొత్తం మంత్రులు.. ఎమ్మెల్యేలపై పెట్టేశారు కేసీఆర్​. అంతకు ముందే సర్వే కూడా చేయించేశారట.. దాని ప్రకారం అన్ని మనమే గెలుస్తామని తేలిందని కూడా చెప్పేశారు.  

పనిలో పనిగా టీడీపీ నుంచి టీఆర్​ఎస్​లో  చేరిన మంత్రి మల్లారెడ్డి.. కాంగ్రెస్​ నుంచి టీఆర్​ఎస్​లో చేరిన మాజీ మంత్రి సుధీర్​రెడ్డి పబ్లిక్​ మధ్యన పెట్టుకున్న పంచాయితీని కూడా చెప్పేశారు. ఇది గొప్పగా పత్రికల్లో రాకున్నా.. కేసీఆర్​ మాత్రం పంచాయితీ పెట్టుకున్న ముచ్చటను పబ్లిక్​లో పెట్టేశారు. ఈ సంగతి పక్కన పెడదాం.

తొలిసారి గెలిచిన తర్వాతే. ప్రతిపక్షాలను కొంత కేసీఆర్​ ఖాళీ చేయించారు. రెండోసారి గెలిచిన తర్వాత… ఇతర పార్టీల నాయకులు దాదాపు 70 శాతం మంది ఇందులో ఎక్కవగా టీడీపీ, కాంగ్రెస్​ నుంచి పోలోమని టీఆర్​ఎస్​లో చేరిపోయారు. ఇంతమంది టీఆర్​ఎస్​ కారులో ఎక్కడంతోనే.. బరువైక్కువైంది. కానీ ఎవరూ దిగడం లేదు. ఇదే ఇప్పుడు మున్సిపల్​ ఎన్నికల్లో పంచాయితీ తెచ్చి పెట్టేట్టు ఉంది. టీఆర్ఎస్​లో మొదటి నుంచి ఉన్నోళ్లలో పెసలున్నోళ్లు తక్కువ. పక్క పార్టీల నుంచి వచ్చినోళ్ల దగ్గర పైసలెక్కువనే ఉన్నాయి. పైసలెక్కువున్న ఈళ్లందరూ ఇప్పుడు టికెట్లు అడుగుతున్నారు. ఎవరికివ్వాలన్నదే ఈడ అసలైన పంచాయితీ. ఒకడికిస్తే ఇంకొకడికి కోపం. పార్టీ మారుతానంటడు. ఈ లొల్లితోటి మంత్రులు.. ఎమ్మెల్యేలు వాచిపోతున్నరు. ఇప్పుడేమో అవన్నీ నాకు తెల్వదు బీ ఫారాలు మీకే ఇచ్చేస్తున్న.. అందరికి నచ్చజెప్పుకోండి అసమ్మతి గిసమ్మతిని అదుపుచేసుకోండి మనం అన్ని సీట్లు కచ్చితంగా గెలవాలని కేసీఆర్​ చెప్పేసిండు. గెలిపించుకోకుంటే వేటు తప్పదని మెడమీద కత్తి పెట్టేసిండు.

ఇక్కడ ఎమ్మెల్యేలకు పదవైతే పోయేదేమీ లేదు. పోయేదంత మంత్రులకే. ఎందుకుంటే ఓడితే పదవి ఊడిపోతది. బుగ్గకారుకు తప్ప(ఇప్పుడు ఇది కూడా లేదు) మంత్రి పదవి ఎందుకు ఉపయోగపడుతుంది. మనం చెప్పిన మాట ఎవడింటలేడని టాక్​ ఉంది. ఇక ఈ పదవి  ఉంటేందీ ఊడుతేందీ అని మంత్రులనుకుంటే కేసీఆర్​ కూడా చేసేదేమీ లేదు. ఎన్ని తలకాలు లేచిపోతాయో.. జనవరి 26న రిపబ్లిక్​ డే నాడు తేలుతుంది. ఎందుకుంటే ఎన్నికల రిజల్ట్​ జనవరి 25న.. ఏ మంత్రి ఇలాకాలో ఎన్ని ఓడిపోయారు. ఎన్ని గెలిచారో తేలిపోతుంది కాబట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here