Home తాజా వార్తలు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చేదెవ‌రో తేలిపోయింది

కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చేదెవ‌రో తేలిపోయింది

132
0
  • వికాస్ రుషి

మే 23న విడుద‌లయ్యే లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో విజేత ఎవ‌రో స్ప‌ష్ట‌మైంది. మెజారిటీ త‌గ్గినా.. మ‌ళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రానుంద‌ని తేలిపోయింది. మీడియాలో కొద్ది రోజులుగా వ‌స్తున్న క‌థ‌నాలు, స‌ర్వేలు, వార్త‌లు చ‌దువుతుంటే.. ప్ర‌ధాని పీఠం ఏ పార్టీకి ద‌క్కుతుందో ఓట‌ర్ల‌కు సులువుగా అర్థ‌మైపోతోంది. ఓటు వినియోగించుకునే వారిలో అతి ఎక్కువ మంది అధికారం చేప‌ట్టే.. పార్టీ, బ‌ల‌మైన అభ్య‌ర్థిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. ఎందుకుంటే తాము వేసే ఓటు వృథా కావ‌ద్ద‌న్న ఏకైక కార‌ణంతోనే. పోలింగ్ కు ముందు ఏ పార్టీ గురించి మాట్లాడినా.. అభ్య‌ర్థుల నుంచి డ‌బ్బు తీసుకున్నా..(ఒక‌రి నుంచి కాదు..పోటీలో నిల‌బ‌డిన ప్ర‌తి అభ్య‌ర్థి నుంచి తీసుకుంటున్నారనుకో అది వేరే సంగ‌తి) పోలింగ్ స్టేష‌న్‌కు వెళ్లిన త‌రువాత ఎక్కువ మంది అధికారంలోకి వ‌చ్చే పార్టీకే ఓటు వేస్తారు. ఇది కూడా అయా రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా నిర్ణ‌యాల్లో మార్పు ఉంటుంది. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది లోక్‌స‌భ ఎన్నిక‌లు కాబ‌ట్టి.. స‌హ‌జంగా జాతీయ పార్టీల‌పైనే ఎక్కువ‌గా ఓట‌ర్లు దృష్టి సారిస్తారు. ఒక్క ద‌క్షిణాదిలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ బ‌లం నామ‌మాత్రంగా మిగిలిపోయింది. తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు కొంత బ‌ల‌ముంటే.. బీజేపీకి అంత‌కంటే త‌క్కువ బ‌ల‌ముంది. కొన్నిసీట్లు రాబ‌ట్టుకునే అవకాశ‌ముంది. కేర‌ళ‌లో బీజేపీకి నామ మాత్రం బ‌ల‌ముంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు బ‌ల‌ముంది. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ వ‌ర్సెస్ అన్న‌ట్టుగానే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ప్ర‌త్య‌ర్థిగా కాంగ్రెస్ ఉంటే.. మ‌రికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నాయి. ఇటీవ‌ల వ‌స్తున్న స‌ర్వేలు.. క‌థ‌నాల ప్ర‌కారం.. బీజేపీ కూట‌మికి సీట్లు త‌గ్గుతాయి.. అది 240కి ప‌రిమిత‌మ‌వుతుందని తేలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 150 సీట్ల‌కు మించ‌ద‌ని తేలింది. బీజేపీ అధికార పీఠంపై కూర్చోవ‌డానికి 40 సీట్ల దూరంలో నిలుస్తుంది. ఈ 40 సీట్లు కూడ‌గ‌ట్టుకోవడానికి బీజేపీకి క‌ష్ట సాధ్య‌మేమీ కాదు. ఆ పార్టీని ఆదుకోవ‌డానికి టీఆర్ఎస్‌, వైఎస్సార్ కాంగ్రెస్ ఉండ‌నే ఉన్నాయి. ఏ కూట‌మిలో లేని న‌వీన్ ప‌ట్నాయక్ ఉండ‌నే ఉన్నారు. తెలంగాణ‌లో లెక్క‌లు ఎటూ తిప్పినా… టీఆర్ఎస్‌కు 11 సీట్ల‌కు త‌గ్గ‌దు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ 15 సీట్ల‌కు త‌గ్గ‌దు. ఇంకా చిన్నా చిత‌క పార్టీలూ ఉన్నాయి. చివ‌ర‌కు ఇప్పుడు కాంగ్రెస్‌తో క‌లిసి ఉన్న డీఎంకే ఎన్డీఏలో చేర‌వ‌చ్చు. మ‌రికొన్ని పార్టీలూ కూడా చేర‌వ‌చ్చు.ఇందులో భాగంగానే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను మోదీ రంగంలోకి దింపార‌ని, అందుకే కేసీఆర్‌.. ప‌క్క‌ రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూట‌మికి 150 సీట్లు వ‌స్తే ఆ పార్టీకి ఇంకా 130 సీట్ల బ‌లం అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇంత పెద్ద మొత్తంలో సీట్లు స‌మ‌కూర్చుకోవ‌డం ఆ పార్టీకి క‌ష్టం. ఈ రెండు కూటమ్ములో లేని పార్టీల‌కు 150 సీట్లు గెలిచినా… ఎవ‌రూ ప్ర‌ధాన‌మంత్రి కావాల‌న్న దానిపై పేచీ. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌మ‌త బెనర్జీ కూడా బెంగాల్‌ను విడిచి రాక‌పోవ‌చ్చు. కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ఏర్ప‌డితే ఎలా ఉంటుందో.. గ‌తంలో కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించిన తీరు చూసిన పార్టీలు.. ముందుకొచ్చే ధైర్యం చేయ‌క‌పోవ‌చ్చు. అలా అని కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు కూడా క‌న్పించ‌డం లేదు. ఎందుకంటే.. రాహుల్‌ను ప్ర‌ధానిగా కాంగ్రెస్ నేత‌లే అంగీక‌రించ‌డం లేదు. మిగ‌తా పార్టీలు ఎలా ముందుకొస్తాయి. సో ఏతా వాత చెప్పొచ్చేదేమిటంటే మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here