కర్ణాటక సంకీర్ణ సర్కారుపై విశ్వాస పరీక్ష టీవీ సీరియల్ మాధిరిగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లుగా సాగుతోంది. ఈ నెల 5 నుంచి సంకీర్ణ సర్కారు కొనసాగడంపై నాటకాలు సాగుతూ చివరకు నాలుగు రోజులుగా విశ్వాసపరీక్ష పేరుతో ముందుకు సాగుతోంది. గురువారం మొదలైన ఈ విశ్వాస పరీక్ష చివరకు సోమవారం ముగిస్తానని స్పీకర్ రమేశ్ కుమార్ చెప్పారు. అయినప్పటికీ.. అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు సాగాయి. బీజేపీ పక్షనేత యడ్యూరప్ప మాట్లాడుతుంటే.. అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. చివరకు ఓటింగ్ జరగకుండా చేయడంలో ముఖ్యమంత్రి కుమారస్వామి విజయం సాధించి.. తన సర్కారు మనుగడను మరోరోజు పొడిగించుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల కల్లా విశ్వాస పరీక్ష ముగిస్తానని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించారు.