Home breaking news ఒక ఎన్​కౌంటర్​.. తెరపైకి ఎన్నో ప్రశ్నలు.? మరి సమాధానాలు..?

ఒక ఎన్​కౌంటర్​.. తెరపైకి ఎన్నో ప్రశ్నలు.? మరి సమాధానాలు..?

187
0

–వికాస్​ రుషి

‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్​.. అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దిశపై జరిగిన సాముహిక అత్యాచారం.. హత్యను ఎవరూ సమర్ధించడం లేదు. కానీ న్యాయం విషయంలోనే తేడా కన్పిస్తోందన్న వాదన మాత్రం తెరపైకి వచ్చింది. సమాజంలో ఉన్నత సామాజిక వర్గంగా ప్రచారంలో ఉన్న కులానికి చెందిన  దిశపై హత్యాచారం చేసిన నలుగురిని పోలీసులు కాల్చి చంపారు. కానీ మరుసటి రోజే వరంగల్​లో జరిగిన హత్యాచారం సంగతేమిటీ..? ఆ నిందితుడిని ఎందుకు ఎన్​కౌంటర్​ చేయలేదన్న ప్రశ్న ఘాటుగా వేస్తున్నారు. వరంగల్​లో హత్యాచారానికి గురైన విద్యార్థిని సామాజిక వర్గం కారణంగానే.. కేసు చిన్నగా కన్పించినట్టుందన్న వాదన మాత్రం సాగుతోంది. అసిఫాబాద్​ జిల్లాలో  కూడా కాగితాలు ఏరుకునే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి.. దారుణంగా హతమార్చారు.  నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మరి వీరిని ఎందుకు ఎన్​కౌంటర్​ చేయడం లేదన్న ప్రశ్న వేస్తున్నారు.  యాదాద్రి  భువనగిరి జిల్లా హాజీపూర్​లో ముగ్గురు బాలికలను రేప్​  చేయడంతో పాటు వారిని హత్య చేసి బావిలో పూడ్చి పెట్టిన ఉదంతం అందరికీ తెలిసిందే. ఈ సంఘటనలకు కారకుడైన మర్రి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు. ఎనిమిది నెలలుగా విచారణ సాగుతోంది. ఈ ఘటన విషయంలోనూ బాధిత కుటుంబాల నుంచి ఇదే ప్రశ్న తలెత్తుతోంది. శ్రీనివాసరెడ్డిని ఎందుకు ఎన్​కౌంటర్​ చేయలేదంటూ ఆందోళనకు దిగుతున్నారు. 

ఈ ఘటనలన్నింటిలోనూ.. కచ్చితంగా సామాజిక వర్గం కన్పిస్తోంది. దిశ ఎన్​కౌంటర్​లో చనిపోయింది ఆర్ధికంగా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారే. ఈ ఘటనలో పెద్దోళ్ల పిల్లలుంటే.. ఎన్​కౌంటర్​ చేసే వారా..? అన్న ప్రశ్న ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. ఇదే ప్రశ్నను ఎన్​కౌంటర్​ చనిపోయిన చెన్న కేశవులు తల్లి కూడా వేస్తున్నారు. ఇదే సందర్భంలో మీడియాతో, ప్రజా ప్రతినిధులు కూడా సామాజిక వివక్షను చూపిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దిశ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యం వరంగల్​, ఆసిఫాబాద్​లో హత్యాచారాలకు గురైన వారికి ఇవ్వలేదన్న  వాదన తెరపైకి వచ్చింది. గడిచిన పది రోజులుగా మీడియాలో వచ్చిన కథనాలు కానీ, ప్రజా ప్రతినిధుల పరామర్శలో వివక్ష కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోందన్న వాదనలో నిజమున్నట్టుగా కన్పిస్తోంది. దిశ ఘటన జరిగింది హైదరాబాద్​లో, ఇక్కడే మీడియా ఎక్కువగా మోహరిస్తోంది. ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటారు. అందుకే పోలోమని తరలి వెళ్లారు. చివరకు దిశ కుటుంబీకులే.. పరామర్శను తట్టుకోలేక తలుపులు వేసుకున్నారు. వరంగల్​లో  విద్యార్థిని, ఆసిఫాబాద్​లో చిత్తు కాగితాలు ఏరుకునే మహిళపై జరిగిన హత్యాచారాలకు ప్రాధాన్యమివ్వలేదనడంలోనూ నిజముంది. ఎందుకంటే వారిని చివరకు సోషల్​ మీడియా సహా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవానికి బాధితులకు  కులం ఆపాధించకూడదు కానీ కన్పిస్తున్న పరిస్థితులల్లో  కులం తెరపైకి వచ్చింది. అందుకే అనాలోచితంగా.. ఆవేశపూరితంగా  పనులు చేయకూడదంటారు. దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కూడా అనాలోచితంగా చోటు చేసుకున్నదే అన్న వాదనలో నిజముంది. నాలుగు తూటాలతో సమస్య ముగిసిపోతుందని భావించారు. కానీ  కొన్ని వందల ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మరి వీటికి సమాధానాలు ఎవరు ఇవ్వాలి.  పోలీసులా.? న్యాయస్థానాలా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here