Home తాజా వార్తలు ఎన్నిక‌ల యుద్ధంలో మ‌మ‌త దూకుడు | Mamatha vs Bjp

ఎన్నిక‌ల యుద్ధంలో మ‌మ‌త దూకుడు | Mamatha vs Bjp

146
0
  • వికాస్ రుషి

యుద్ధం ఎలా చేయించాలో ఎలా చేయాలో.. రాజ‌కుమారుడికి తెలియక పోవ‌చ్చు. కానీ వ్యూహ‌క‌ర్త‌కు తెలుసు. దాన్ని అమ‌లు చేసే సైనికుడికీ తెలుసు. ఎన్నిక‌ల యుద్ధం కూడా అంతే. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలవాల‌ని ప‌ట్టుద‌ల‌తో బీజేపీ ముందుకు సాగుతోంది. ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నా.. కాంగ్రెస్ గెల‌వాల‌ని రంగంలోకి దిగింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ రాజ‌కుమారుడిలా ఉన్న రాహుల్‌కు యుద్ధ రంగంలో దూకుడుగా ముందుకు సాగ‌లేక పోతున్నారు. ఆ పార్టీకి స‌రైన వ్యూహ‌క‌ర్త‌లు కూడా లేరు. (లేరు అన‌డం కంటే.. రాహుల్‌కు చెప్ప‌లేక పోతున్నారేమో..?) అందుకే బీజేపీతో స‌రైన రీతిలో యుద్ధం చేయ‌లేక పోతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీని ఎదిరిస్తున్న‌దెవ‌రంటే.. క‌చ్చితంగా ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. కాంగ్రెస్‌లో కార్య‌క‌ర్త‌గా జీవితం ఆరంభించిన‌ ఆమె..క‌మ్యూనిస్టుల‌తో పోరాటం చేసి వారి యుద్ధతంత్రాన్నే పూర్తిగా ఆక‌లింపు చేసుకున్నారు. క‌మ్యూనిస్టుల‌తో యుద్ధం చేయ‌డంలో ఎప్పుడైతే కాంగ్రెస్ వెనుక‌డుగు వేసిందో.. అప్పుడే ఆమె కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకోవ‌డానికి సొంత పార్టీ ఏర్పాటు చేశారు. చివ‌ర‌కు బెంగాల్‌లో అధికారం చేప‌ట్టారు. ఇప్పుడు రెండో ద‌ఫా అధికారంలో కొన‌సాగుతున్నారు. క‌మ్యూనిస్టులు త‌న‌పై ప్ర‌యోగించిన యుద్ధ తంత్రాన్నే… తిరిగి ఆమె వారిపై ప్ర‌యోగించారు. ఆమె యుద్ధ‌తంత్రానికి క‌మ్యూనిస్టులు పూర్తిగా కుదేలై పోయారు. కాంగ్రెస్ కూడా క‌నుమ‌రుగైంది. ఈ రెండు పార్టీలు గ‌త ఎన్నిక‌ల్లో 2-4 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌య్యాయి. 2004 ముందు వ‌ర‌కూ బెంగాల్లో అడుగుకూడా పెట్ట‌ని బీజేపీ 2014 ఎన్నిక‌ల్లో 2 ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 3 సీట్ల‌ను గెలుచుకుంది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 12 శాతం ఓట్ల‌ను సాధించుకుంటే బీజేపీకి 10 శాతం ఓట్ల‌ను సాధించుకుంది. ఈ ఎన్నిక‌ల్లో మ‌మ‌త‌కు ప్ర‌త్యామ్నాయంగా నిలిచింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇది గ‌మ‌నించిన మ‌మ‌త‌.. భ‌విష్య‌త్‌లో త‌న‌కు ప్ర‌మాద‌కరంగా మారుతుంద‌న్న ఉద్దేశంతో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి బీజేపీతో యుద్ధం చేస్తున్నారు. క‌మ్యూనిస్టుల‌పై ప్ర‌యోగించిన యుద్ధ‌తంత్రాన్నే బీజేపీపై అమ‌లు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బెంగాల్‌లో బీజేపీ ఎన్నిక‌ల‌ స‌భ‌ల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌కుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా హాజ‌ర‌య్యే స‌భ‌ల‌కు కూడా అన‌మతి ఇవ్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. చివరి విడత పోలింగ్లో భాగంగా రాష్ట్రంలోని జాదవ్‌పూర్ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా పాల్గొనాల్సి ఉండగా, దానికి అనుమ‌తివ్వ‌లేదు. అమిత్ షా హెలికాప్టరు జాదవ్‌పూర్‌లో ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. ఇలా అమిత్ షా హెలికాప్టరుకు అధికారులు అనుమతి నిరాకరించడం మొదటి సారి కాదు. గతంలో మాల్దా జిల్లా ర్యాలీలో అమిత్ షా పాల్గొనకుండా హెలికాప్టరు ల్యాండింగ్ కు నో చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టరు ల్యాండింగుకు కూడా పశ్చిమబెంగాల్ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆయన రోడ్డు మార్గంలో వచ్చారు. కొన్ని ర్యాలీల్లో నేరుగా కాకుండా ఫోన్‌లో సందేశ‌మిచ్చారు. ఒక ముఖ్య‌మంత్రి నేరుగా కేంద్రంతో త‌ల‌ప‌డి యుద్ధం చేస్తుంటే.. కేంద్రంలో అధికారంలోకి వ‌స్తామ‌ని క‌లలు కంటున్న రాహుల్ మాత్రం బీజేపీని ఎలా అడ్డుకోవాలో తెలియ‌క తెల్ల ముఖం వేస్తుకొని చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here