Home తాజా వార్తలు ఇటువంటి జోక్ ఇంత‌వ‌ర‌కూ రాలేదు | Tpcc

ఇటువంటి జోక్ ఇంత‌వ‌ర‌కూ రాలేదు | Tpcc

209
0
  • వికాస్ రుషి

అప్పుప‌త్రం ఉంటుంది. కానీ తీసుకున్నోళ్ల‌లో కొంత ఎగ్గొడుతుంటారు. ఇచ్చే డ‌బ్బులకు చెక్కులిస్తుంటారు. అయినా ఏం చేస్కుంటావో చేస్కో అంటారు. ఆస్తుల కొనుగోలు ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలుంటాయి. అడ్వాన్సులు ఇచ్చి పుచ్చుకుంటారు. రేటు పెరిగిందా.. మా ఇంటామే ఒద్దంటుంది. నేన‌మ్మ అంటాడొక‌డు. నా కొడుకులొద్దంటున్నారంటాడు మ‌రొక‌డు. పెరిగిన రేటు ప్ర‌కారం ఓకే అంటారు. ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే.. పార్టీ ఫిరాయింపుల‌తో కుదైలైన కాంగ్రెస్‌కు విచిత్ర ఆలోచ‌న క‌లిగింది. ఆ ఆలోచ‌న ప్ర‌కారం.. అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తార‌ట‌. ఇంత‌కీ ఆలోచ‌న ఎంటంటే.. గెలిచిన త‌ర్వాత పార్టీ మార‌న‌ని అఫిడ‌విట్ ఇస్తేనే జ‌డ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేయ‌డానికి టికెట్లు ఇస్తామ‌ని చెబుతుందంట‌. దీనికి సంబంధించి ఏక‌గ్రీవంగా తీర్మానం కూడా చేసింది.

ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన వాళ్ల‌లో స‌గం మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో పార్టీలో ఎంతో కాలం నుంచి ప‌ని చేస్తున్న‌వారు ఉన్నారు. వీళ్లంద‌రూ కాంగ్రెస్ బీ ఫారం మీద‌నే క‌దా పోటి చేసింది. ఫిరాయింపుల చ‌ట్టం ప్ర‌కారం అన‌ర్హుల‌మ‌వుతామ‌ని తెలిసి కూడా వాళ్లు టీఆర్ఎస్‌లో చేరారు. అయితే అది రుజువైన నాడు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ మారిన వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌క‌ముందే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు రావ‌డం వాళ్లు గెల‌వ‌డం జ‌రిగిపోయింది. ఫిరాయింపుల చ‌ట్టానికి అన‌ర్హ‌త వేటుకు భ‌య‌ప‌డ‌కుండా ప‌ద‌వి కోసం అధికార పార్టీలో చేరిన వారు క‌ళ్ల ముందు క‌న్పిస్తుండ‌గా.. జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత పార్టీ మార‌మ‌ని అఫిడ‌విట్ ఇచ్చిన వారు.. క‌ట్టుబ‌డి ఉంటారా..? చిత్రం కాకుంటే. పార్టీలో ఉండాల‌నుకునే వాళ్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉంటారు. పార్టీ మారాల‌నుకునే వారు ఏ అఫిడ‌విట్ ఇచ్చినా.. దేవుడి ప‌టాల ముందు ప్ర‌మాణాలు చేసినా.. మారుతారు. అఫిడ‌విట్ ఇస్తేనే టికెట్ ఇస్తామ‌న్న‌జోక్ ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌ని కూడా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here