Home తాజా వార్తలు ఆ ప‌త్రిక‌కు అప్ప‌టి తెగువ ఉందా..?

ఆ ప‌త్రిక‌కు అప్ప‌టి తెగువ ఉందా..?

119
0
  • వికాస్ రుషి

నిజాలు నిక్క‌చ్చిగా.. రాస్తాం. ద‌మ్మున్న వార్త‌లు రాస్తాం. ఈ నెంబ‌ర్ల‌కు మీరు స‌మాచారం ఇవ్వండి.. మేము వార్త రాస్తాం. అవినీతిప‌రుల గుండెల్లో నిద్ర‌పోతాం. ఇవి నిత్యం మ‌న దిన‌ప‌త్రిక‌ల్లో.. టీవీ ఛాన‌ళ్ల‌లో క‌న్పించే స్ల‌గ్స్‌. ఇక మ‌న విలేక‌రులైతే.. మేమే తోపులం. మ‌మ్ముల‌ను మించిన వారే లేర‌న్న‌ట్టుగా (ఇదంతా బ‌య‌ట‌కే.. లోప‌ల మాత్రం ఆఫీసుకు వెళ్లే స‌రికి నా ఉద్యోగం ఉంటుందా.? అన్న అనుమానం ) ఉంటారు. అధికారులు.. రాజ‌కీయ పార్టీలైతే.. న‌మ‌స్తే సార్ (లోపల మాత్రం వ‌చ్చాడ‌య్య) జ‌నం కూడా అబ్బో విలేక‌రా.? మ‌స్తు సంపాద‌న ఇలా ఎవ‌రికి తోచిన‌ట్టుగా వాళ్లు. పాపం ఎంత సంపాదిస్తారో విలేక‌రుల‌కే ఎరుక‌. దీన్ని ఉచ్చులో ప‌డి.. ఎంతో మంది త‌మ జీవితాల‌నే నాశ‌నం చేసుకున్న చ‌రిత్ర‌లు అనేకం. కొద్ది మంది మాత్రం సంపాదించుకున్న‌రనుకో. పేర్లు అన‌వ‌స‌రం. ఈ ధ‌మ్ము.. ధైర్యం.. ప‌దాలు చెప్పే మీడియా (ఇందులో ప‌త్రిక‌లు, టీవీలు క‌లిపి) త‌మ సొంత అవ‌స‌రం కోసం మాత్రం రాజీప‌డ‌తాయి. రెండు ప్ర‌ముఖ ఛానళ్లు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు కోసం ఇద్ద‌రు ముఖ్య‌మైన యాంక‌ర్ల‌ను తొల‌గించాయి. స‌రే ఈ ప్ర‌స్తావ‌న ఎందుకొచ్చిందంటే.. ఈనాడు దిన‌ప‌త్రికకు చెందిన మేడ్చ‌ల్ స్టాప్ రిపోర్ట‌ర్ భానుచంద‌ర్‌రెడ్డి అక్రిడిటేష‌న్ ను ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ర‌ద్దు చేశారు. దీనికి సంబంధించి ఈనాడు ప‌త్రిక‌కు స‌మాచారం అందించారు. ఏప్రిల్ 14న హెచ్ఎండీఏ కార్యాల‌యం త‌ర‌లింపున‌కు సంబంధించి రాసిన వార్త క‌థ‌నం త‌ప్పు.. కావాల‌నే దురుద్దేశంతో రాశారు కాబ‌ట్టి.. ఆ రిపోర్ట‌ర్ అక్రిడిటేష‌న్ ర‌ద్దు చేశామ‌ని కలెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. క‌థ‌నం త‌ప్ప‌యితే.. దాన్ని ఖండిస్తూ అదే స్థాయిలో వార్త రాయాల‌ని కోర‌వ‌చ్చు. లేదా న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు. అలాంటిదేమీ లేకుండా.. అక్రిడిటేష‌న్‌ను ర‌ద్దు చేశారు.

ఇక్క‌డ మ‌రో అంశం రాసింది విలేక‌రే కానీ, ప్ర‌చురించింది ప‌త్రిక‌. అలాంట‌ప్పుడు విలేక‌రేనా త‌ప్పు చేసింది. ప‌త్రిక కాదా..? మ‌రి ఒక్క‌డిపైనే ఎందుకు కొర‌డా. బ‌క్కోడిపైనే స‌ర్కారు ప్ర‌తాపమా..? ఎవ‌రైనా బ‌క్కోడిపైనే త‌మ ప్ర‌తాపం చూపిస్తారు. ఒక ఛాన‌ల్ వ‌చ్చిన కొత్త‌లో అవినీతిపై కొర‌డా అంటూ వంద‌లు వేలు మాత్ర‌మే లంచం తీసుకునే వారిని టార్గెట్గా చేసుకొని ప్ర‌సారం చేసి.. పేరు గ‌డించింది. విచార‌క‌ర‌మైన అంశ‌మేమిటంటే..ఈ వార్త ఈనాడు ప‌త్రిక‌లోనూ క‌న్పించ‌లేదు. మిగ‌తా ప‌త్రిక‌లు కూడా కంద‌కు లేని దుర‌ద క‌త్తికి ఎందుక‌నుకున్నాయేమో..? (అన్ని చూడ‌లేం క‌దా) తోపుల‌మ‌ని చెప్పుకునే విలేక‌రులం (నేను కూడా) మ‌న వార్త మ‌నం రాసుకోలేం. అన్యాయం జ‌రిగింద‌టూ ఎవ‌రైన వ‌స్తే వారి వార్త రాస్తాం. మ‌న‌కు అన్యాయం జ‌రిగితే మాత్రం రాసుకోలేం. మ‌న యాజ‌మాన్యాలు అస‌లే ప‌ట్టించుకోవు. ఇక్క‌డ ఒక అంశాన్ని ప్ర‌స్తావించుకుందాం. రెండు ద‌శాబ్దాల క్రితం సినిమా ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు, ఈనాడుకు మ‌ధ్య పెద్ద యుద్ధం న‌డుస్తోంది. అప్ప‌ట్లో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా సూర్యాపేట (ఇప్పుడు జిల్లా)లో రాజ‌కీయ పార్టీల బహిరంగ‌స‌భ జ‌రిగింది. ఆ స‌భ‌కు దాస‌రి నారాయ‌ణ‌రావు కూడా హాజ‌ర‌య్యారు. బ‌హిరంగ‌స‌భ‌లకు సంబంధించి కామ‌న్‌గా వేసే ఫొటో.. అంద‌రూ చేతులెత్తి అభివాదం చేసే వేస్తారు. ఈనాడులో కూడా అదే విధంగా వేశారు. కాకుంటే.. దాస‌రి నారాయ‌ణ‌రావు ఫొటో క‌ట్ చేసి మ‌రీ వేశారు. అప్ప‌ట్లో దాసరి కుమారుడు అరుణ్ సినిమాల్లో ప్ర‌వేశించారు. ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన వార్త‌లు కూడా ఈనాడులో వేసేవారు కాదు. ఈ విష‌యంలో దాస‌రి నా మీద కోపం ఉంటే.. నా వార్త‌లు వేయ‌కండి నా బిడ్డ ఏం పాపం చేశారంటూ ఆవేద‌న‌తో ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మానికి సంబంధించి వార్త‌లు కూడా ఈనాడుతో స‌హా మ‌రికొన్నింటిలో (దీనికి ఆంధ్ర‌జ్యోతి మినహాయింపు.) స‌రిగా వేసేవారు కాదు. న‌మ‌స్తే తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ప‌రిస్థితి మారింద‌నుకోండి. ఇప్పుడు ఈనాడు దిన‌ప‌త్రిక స్టాఫ్ రిపోర్ట‌ర్ అంటే సంస్థ మ‌నిషి. న్యూస్‌టుడే కాదు. అక్రిడిటేష‌న్‌ను ర‌ద్దు చేశారు. ఈ ర‌ద్దు వెనుక ఎలాగూ అధికార పార్టీ ఉంటుంది. కాబ‌ట్టి.. పైన మ‌నం పేర్కొన్నట్టుగా కొంద‌రి వార్త‌లు బ్యాన్ చేశారు క‌దా.. ఇప్పుడు అదే విధంగా చేసే ఈనాడు తెగువు చూపుతుందా.? మ‌న‌కెందుకులే ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి సంబంధించిన యాడ్స్ స‌రిగా రావ‌డం లేదు. జ‌రిగింది అన్యాయం జ‌రిగింది ఉద్యోగికే క‌దా.. అని ఊరుకుంటుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here