Home జాతీయం ఆయ‌న మాట చూస్తే మ‌నసు తెలిసింది — ఆ మ‌న‌సుతోనే నిర్ణ‌యం

ఆయ‌న మాట చూస్తే మ‌నసు తెలిసింది — ఆ మ‌న‌సుతోనే నిర్ణ‌యం

137
0
క‌ర్ణాట‌క స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్

మ‌న‌స్సాక్షి ప్ర‌కార‌మే న‌డుచుకుంటామ‌ని చెబుతుంటారు చాలా మంది. వారి మ‌న‌సేమిటో.. తెలిసి ఉన్న‌వారు న‌డ‌క‌ను గుర్తిస్తారు. తెలియ‌ని వాళ్లు వేచి చూస్తారు. చాలా మందిలాగానే.. క‌ర్ణాట‌క స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ కూడా మ‌న‌స్సాక్షి ప్ర‌కార‌మే న‌డుచుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌, జేడీ(ఎస్) ఎమ్మెల్యేల తిరుగుబాటుతో క‌ర్ణాట‌క సంకీర్ణ రాజ‌కీయాలు మ‌లుపు తిరిగాయి. 14 మంది త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఆమోదించ‌మ‌ని స్పీక‌ర్ ర‌మేశ్‌కుమార్‌ను కోరడం జ‌రిగిపోయింది. ఆయ‌న నిర్ణ‌యం తీసుకోక పోవ‌డంతో.. సుప్రీంను ఆశ్ర‌యించ‌డం.. ధ‌ర్మాస‌నం ఆదేశాల మేర‌కు తిరిగి స్పీక‌ర్ రమేశ్‌కుమార్‌కు రాజీనామాలు స‌మ‌ర్పించారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు చేసిన రాజీనామాలు ఫార్మాట్‌లోనే ఉన్నాయ‌ని చెప్పిన ర‌మేశ్‌కుమార్‌.. వారు స్వ‌చ్ఛందంగా చేశారా..? లేదా..? రాత్రంతా ఆలోచించి మ‌న‌స్సాక్షి ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అదే ప్రెస్‌మీట్లో ఇంకో విష‌యం కూడా చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాల‌ను ఆమోదిస్తే.. వారిపై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) చేసిన విజ్ఞ‌ప్తి చెల్ల‌కుండా పోతోంద‌ని చెప్పారు. ఆద‌రాబాదర‌గా.. నిర్ణ‌యం తీసుకుంటే.. మొత్తం అన్యాయం చేసిన‌ట్ట‌వుతుందన్నారు. ఈ విష‌యంలో నా మ‌న‌స్సాక్షి ఆధారంగానే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగానే రాజీనామాలు సమర్పించారా..లేదా అనే విషయమై రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద‌ని.. నేనేమీ మెరుపువేగంతో పనిచేయలేన‌ని స్ప‌ష్టం చేశారు. నేను ప్రజలకు, రాష్ట్రానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తప్ప ఎవ్వరికీ జవాబుదారీని కాద‌ని ఆయ‌న త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. వాళ్లు న‌న్ను నేరుగా క‌ల‌వ‌కుండా.. గ‌వ‌ర్న‌ర్ వాజుభాయ్ వాలాను ఎందుకు క‌లిశారో, సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్ర‌యించారో అర్థం కావ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు.

ఇక్క‌డ మ‌నం చ‌ర్చించాల్సింది ఏంటంటే.. నిర్ణయం తీసుకోవ‌డానికి రాజీనామాలు ఫార్మాట్ ప్ర‌కారం చేశారా లేదా..? అన్న‌ది చూసుకుంటే స‌రిపోతుంది. అవి ఫార్మాట్ ప్ర‌కార‌మే ఉన్నాయ‌ని స్పీక‌రే చెప్పేశారు. స్వ‌చ్ఛందంగానే రాజీనామాలు చేశారా..? అన్న‌దానిపై రాత్రంత ఆలోచించి, మ‌న‌స్సాక్షి ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకుంటాన‌ని వెల్ల‌డించ‌డం వెనుక గూఢార్థం ఏమిటంటే.. రాజీనామాల‌ను ఆమోదిస్తే.. జేడీ(ఎస్‌), కాంగ్రెస్ స‌ర్కారును కాపాడలేరు. తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటూ వేయ‌లేరు. అందుకే ఆయ‌న తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల‌ను ఆయ‌న ఆమోదించ‌రు. ఎందుకంటే.. ఆయ‌న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆయ‌న మ‌న‌సంతా కాంగ్రెస్సే. రాజీనామాలు ఫార్మాట్ ప్ర‌కారం ఉన్నాయ‌ని నిర్ణ‌యం తీసుకుంటే.. కాంగ్రెస్‌కు అన్యాయం చేసిన‌ట్టే. అదే ర‌మేశ్‌కుమార్ అంత‌ర్లీనంగా చెప్పేశారు. అర్థ‌మైన వాళ్ల‌కు అర్థ‌మైంది. కానీ వాళ్ల‌కు కాలేదు. అయినా నిర్ణ‌యం కొర‌కు వేచి చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here