Home తాజా వార్తలు ఆమె త్యాగానికి విలువేదీ / Ts Ex Dsp Nalini

ఆమె త్యాగానికి విలువేదీ / Ts Ex Dsp Nalini

251
0

కొన్ని త్యాగాలు గుర్తుకు రావు. కొన్నింటికి విలువుండ‌దు. త్యాగాలు చేసిన వారు.. కాగితాల‌కు ప‌రిమిత‌మైతే.. ఆ త్యాగాల‌ను వ‌ల్లె వేస్తూ అంద‌నంత ఎత్తుకు ఎదిగే వాళ్లుంటారు. త్యాగం చేసిన పాతాళానికి పోతారు. ఇంత‌కీ త్యాగాల అంశం ఎందుకంటే.. తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన మ‌హిళ బాబా రాందేవ్ స‌రుకుల షాపు న‌డిపిస్తోంది. ఆ మ‌హిళ ఎవ‌రో అంద‌రికీ గుర్తుండ‌క పోవ‌చ్చు. ఆమె పేరు న‌ళిని. తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా సాగుతున్న స‌మ‌యంలో ప్ర‌జా ప్ర‌తినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తామ‌ని కొంద‌రు.. చేశామ‌ని కొంద‌రు. రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్‌ ఫార్మాట్ ఇవ్వ‌ని వారు కొంద‌రు. విదేశాల‌కు వెళ్లిన కొంద‌రు. తెలంగాణ సాధ‌న కోసం ప‌ద‌వుల‌ను త్యాగం చేశారంటూ కొన్ని ప‌త్రిక‌ల్లో త్యాగ‌ధ‌నులుగా పేర్కొంటూ ప్ర‌త్యేక క‌థ‌నాలు. ఈ స‌మ‌యంలో భావోద్వేగానికి గురైన కొంద‌రు ఆత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఇలాంటి స‌మ‌యంలో డీఎస్పీగా కొన‌సాగుతున్న‌ న‌ళిని.. భావోద్వేగానికి గురైన ఆమె 2009లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్ప‌ట్లో ఇది సంచ‌ల‌న వార్త‌. ఆమె రాజీనామ చేసిన విష‌యంపై చాలా మంది బాధ‌ప‌డ్డారు కూడా. ఇలాంటి ప‌ని ఎందుకు చేశారంటూ కొంద‌రు బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. ఎంద‌రో సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే న‌ళిని.. ఉన్న‌తాధికారుల‌ను క‌ల‌వ‌డం, ముఖ్య‌మంత్రి రోష‌య్య ఆమెకు ఉద్యోగం ఇప్పించ‌డం జ‌రిగిపోయింది. ఆమె తిరిగి ఉద్యోగంలో చేరిపోవ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేశారు. ఆ త‌రువాత‌ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అక్క‌డితో ఆమె రాజ‌కీయ జీవితం ప్రారంభ‌మైంది. ఇదే స‌మ‌యంలో ప‌ర‌కాల ఉప ఎన్నిక వ‌చ్చింది. టీఆర్ఎస్ త‌రుపున న‌ళిని ఆ స్థానంలో పోటీ చేయ‌డానికి టికెట్ ఆశించారు. కానీ ద‌క్క‌లేదు. దీంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌రువాత బీజేపీలో చేరారు. కొద్ది రోజులు గ‌డిచిపోయాయి. ఇప్పుడు బీజేపీలో కూడా క‌న‌బ‌డ‌డం లేదు. అంద‌రూ ఆమె గురించి మ‌ర్చిపోయారు. ఇటీవ‌ల ఉప్ప‌ల్ డిపో ఎదురుగా ఉన్న గ‌ల్లీలో బాబా రాందేవ్ వ‌స్తువులు విక్ర‌యించే షాపున‌కు వెళ్లిన కొంద‌రు ఆమెను గుర్తు ప‌ట్టారు. ఆమె తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన‌ న ళిని. ప్రాణ‌త్యాగం కంటే ఎక్కువ కాక‌పోవ‌చ్చు. కానీ ఎంద‌రో తెలంగాణ కోసం ఉద్య‌మం చేస్తున్నామంటూ.. జీతాలు తీసుకుంటూనే కాలం గ‌డిపారు. ఆమె మాత్రం ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేయ‌కుండా.. ఆమె ఆ ఉద్యోగంలో కొన‌సాగి ఉంటే.. ఈనాడు ఎస్పీ కేడ‌ర్‌లో ఉండేవారు. కొంద‌రంతే. వారి త్యాగాలు వారికే ఉప‌యోగ‌పడ‌వు. చివ‌రకు వారే మ‌రుగున ప‌డిపోతారు. అందుకే పెద్ద‌ల‌న్నారు.. త‌న‌కు మాలిన‌ ధ‌ర్మం కూడద‌ని..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here