Home జాతీయం అన్ని పార్టీలూ తిరిగేశారు.. చివరకు బీజేపీలోకి మోత్కుపల్లి జంప్

అన్ని పార్టీలూ తిరిగేశారు.. చివరకు బీజేపీలోకి మోత్కుపల్లి జంప్

136
0
అన్ని పార్టీలూ తిరిగేశారు.. చివరకు బీజేపీలోకి మోత్కుపల్లి జంప్
మోత్కుపల్లి నర్సింహులు

అన్ని పార్టీలు తిరిగేశారు. ఇక మిగిలింది బీజేపీ.. చివరకు అందులోకి జంప్​ చేస్తున్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. రాజకీయంగా ఎటు వెళ్లాలో  తెలియక మౌనంగా ఉన్న ఆయనను బీజేపీ సంప్రదించింది. వాళ్లు అడిగిందే తడవుగా వచ్చేస్తానని చెప్పేశారు మోత్కుపల్లి. బీజేపీలో ఎప్పుడు చేరుతారో తేదీ ఒకటే ఖరారు కావాల్సి ఉంది.

ఉస్మానియా విద్యార్థిగా వామపక్ష భావజాలంలోని స్టూడెంట్​ యూనియన్​లో ఉన్న మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1985 మధ్యంతర ఎన్నికల్లోనూ గెలిచారు. మంత్రిగా పలు శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. 1989 ఎన్నికల్లో ఆయనకు ఎన్టీఆర్​ టికెట్​ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్​గా గెలిచి, తిరిగి టీడీపీలో చేరిపోయారు. 1991లో నంద్యాల ఎంపీగా పోటీ చేసి పీవీ నర్సింహారావు చేతిలో ఓడిపోయారు. 1994 టీడీపీ, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థిగా గెలిచారు. కాంగ్రెస్​ అభ్యర్థిగా గెలిచినా.. చివరకు తెలుగుదేశం అనుబంధ సభ్యుడిగా కొనసాగారు.

చంద్రబాబు వెన్నుపోటుతో ఎన్టీఆర్​ గద్దె దిగిన సమయంలో తొలుత ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెన్నంటి ఉన్నారు. ఆ తరువాత తిరిగి వారిద్దరు చంద్రబాబుతో కలిసి పోయారు. 2004 ఎన్నికలు, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున తుంగతుర్తి నుంచి గెలిచారు. 2014లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో సీపీఎం మద్దతుతో ఆలేరులో ఇండిపెండెంట్​గా పోటీ చేసి ఓడిపోయారు.

కేసీఆర్​ను తిట్టిన తిట్టు తిట్టకుండా

ముఖ్యమంత్రి కేసీఆర్​ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారిలో మోత్కుపల్లి నర్సింహులును మించిన వారు లేరు. 2009 నుంచి 2016 వరకూ కేసీఆర్​ అంటే మోత్కుపల్లి నుంచి తిట్లు జాలువారేవీ. ఆ తరువాత తనకు గవర్నర్​ పదవి ఇప్పిస్తానని ఇప్పించలేదంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీని టీఆర్​ఎస్​లో విలీనం చేయమంటూ చంద్రబాబుకు సలహా ఇచ్చారు. దీంతో ఆయనను టీడీపీ నుంచి బహిష్కిరించారు. అనంతరం కేసీఆర్​పై పొగడ్తలు మొదలు పెట్టారు. ఆయనను మించిన వారు లేరంటూ మెచ్చుకోవడం మొదలు పెట్టారు. ఒక దశలో టీఆర్​ఎస్​లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. చివరకు ఏమీ జరగలేదు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్​పై కూడా ప్రశంసలు కురిపించారు. 2018 ఎన్నికల సమయంలో మోత్కుపల్లిని బీజేపీ నేతలు సంప్రదిస్తే తనకు గవర్నర్​ పదవి ఇస్తానంటే వస్తానంటూ మెలిక పెట్టారు. దీంతో బీజేపీ నేతలు వెనుదిరిగారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. బీజేపీ నేతలతో ఆయన టచ్​లోకి రావడం చేరడానికి అంగీకరించడం జరిగిపోయింది. సో అన్ని పార్టీలు తిరిగిన మోత్కుపల్లి నర్సింహులు చివరకు బీజేపీలోకి చేరిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here